అమలాపురం: కోనసీమ కుర్రోడు రంకిరెడ్డి స్వాతిక్ సాయిరాజ్ రెండో అంతర్జాతీయ స్థాయి క్రీడా వేదిక అయిన కామన్వెల్త్ క్రీడల్లో భారత దేశం తరపున బ్యాడ్మింటన్ ఆడే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే వివిధ దేశాల్లో జరిగిన 15కు పైగా అంతర్జాతీయ బ్యాడ్మింటర్ పోటీల్లో సాత్విక్ తన ప్రతిభ చూపాడు. గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియాలో బుధవారం నుంచి ప్రారంభమవుతున్న 21వ కామన్వెల్త్ గేమ్స్‌లో సాత్విక్ సత్తా చూపేందుకు సై అంటున్నాడు. సాత్విక్ మెన్ డబుల్స్, మిక్సిడ్ డబుల్స్‌లో ఆడనున్నాడు.
సాత్విక్ తండ్రి రంకిరెడ్డి కాశీ విశ్వనాథం వ్యాయామ ఉపాధ్యాయుడిగా...ఫిజికల్ డైరెక్టర్‌గా... ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు. సాత్విక్ కామన్వెల్త్‌కు వెళ్లడంపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి, జిల్లా ఒలింపిక్స్ అధ్యక్ష కార్యదర్శులు చుండ్రు గోవిందరాజులు, కె.పద్మనాభం, ఉపాధ్యక్షడు డాక్టర్ మెట్ల వెంకట సూర్యనారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు, మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, గొల్లవిల్లి నిమ్మకాయల రంగయ్య నాయుడు మెమోరియల్ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
జిల్లా ఒలింపిక్‌అసోసియేషన్ హర్షం
భానుగుడి (కాకినాడ సిటీ): ఆస్ట్రేలియాలో బుధవారం నుంచి జరగనున్న కామన్‌వెల్త్ గేమ్స్‌కు షెటిల్ బాడ్మింటెన్‌లో భారత దేశం తరుపున అమలాపురం వాసి రంకిరెడ్డి స్వాతిక్ సాయిరాజ్ (17) ఎంపిక కావడంపై జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసిందని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు ఒక ప్రకటనలో తెలిపారు. సాయిరాజ్ విజయంతో తిరిగిరావాలని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, క్రీడా సంఘాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.ఇంటర్మీడియట్ చదువుతున్న సాయిరాజ్ ప్రస్తుతం హైదరాబాద్ గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment