
సాక్షి, విజయవాడ : పేదల భూములు కొట్టేసి ఆస్తులు సంపాదించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులు పనిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో బెదిరించి 33 వేల ఎకరాల భూమిని లాక్కుని రైతులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. టీడీపీ నేతలు చాలా చోట్ల రికార్డులు తారుమారుచేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘2017ను టీడీపీ భూకబ్జాల సంవత్సరం’గా అభివర్ణించారు.
హుద్‌హుద్‌లో భూరికార్డులు హుష్‌కాకి.. : ‘‘రైతులు, కూలీలను ద్వేషించే చంద్రబాబు నాయుడు.. హుద్‌హుద్ తుఫాను తర్వాత రెవెన్యూ రికార్డులను మాయం చేసి, విశాఖ జిల్లాలో లక్షల ఎకరాలను కాజేశారు. ఆ కుంభకోణంపై ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు జరగలేదు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రాజధాని రైతులను బెదిరించి 33 వేల ఎకరాలను కాజేశారు. దాంతో లక్షల మంది రైతు కూలీలు, కౌలు రైతుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని కోర్టులు మొట్టికాయలు వేసినా టీడీపీ సర్కారు తీరు మారలేదు. గడిచిన మూడున్నరేళ్లలో వేలమంది రైతుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయే తప్ప రాజధానిలో శాశ్వత నిర్మాణమంటూ ఒక్కటీ జరగలేదు. అసలు రాజధానిని కట్టాలన్న ఆలోచనే చంద్రబాబుకు లేదు’’ అని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.
ప్రతిపక్షం లేకుండా శాసనసభను నడిపడం సిగ్గుమాలిన చర్య అని వ్యాఖ్యానించిన ఆర్కే.. 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేసేందుకు బాబు విఫలయత్నం చేశారని గుర్తుచేశారు. ఇప్పటికైనా రైతుల పొట్టకొట్టే విధానాలకు చంద్రబాబు స్వస్తిపలకాలని హితవుచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment