ఆహార పదార్థాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరిలో రాజన్న క్యాంటీన్ ఆహారం తీసుకుంటున్న ప్రజలు
తాడేపల్లిరూరల్: అన్నం, సాంబారు, కోడి గుడ్డు, పెరుగు, అరటి పండు, వడియాలు..ఆహా.. చెబుతుంటేనే నోరూరుతుంది కదూ.. వీటి ధర ఎంతో తెలుసా.. కేవలం 4 రూపాయలు. ఏంటి నమ్మకం కలగడం లేదా.. అయితే మంగళగిరి నియోజకవర్గంలో ఆకలి గొన్న పేగులను అడగండి. సంవత్సరం నుంచి తమ కడుపు నింపుతున్నాయని చెబుతాయి. ఈ ఏడాదిలో ఏనాడూ పస్తుల మాటే లేదని పొట్ట నిమురుకుంటూ ఆనందంతో పొంగిపోతాయి. కనీసం గుడ్డు కూడా రాని ధరకు తమకు నిండు కుండై కూడు పెడుతున్నాయని సంబరపడతాయి. అవును మరి.. వైఎస్సార్ సీసీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. సరిగ్గా ఏడాది క్రితం రాజన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి రోజు 500 నుంచి 600 మందికి పౌష్టికాహారం అందిస్తున్నారు.
ఎన్నో ఎండిన డొక్కలకు మెతుకై కడుపు నింపుతున్నారు. ప్రతి రోజూ రూ.4లకు సాంబారు, పెరుగు అన్నం, అరటి పండు, కోడి గుడ్డు, ఒడియాలు ఇస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభయ్యే రాజన్న క్యాంటీన్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. ఉండవల్లిలో ప్రత్యేకమైన వంటశాలను ఏర్పాటు చేసి ఏడుగురు వంట మాస్టర్లుతో వండిస్తున్నారు. ఆహారాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో మంగళగిరి తీసుకువెళ్లి నలుగురు వ్యక్తులతో పేదలకు అందిస్తున్నారు. ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లాలో పలు చోట్ల తన సొంత పొలంలో పండించిన పంటను పూర్తిగా ఈ రాజన్న క్యాంటీన్‌కు ఉపయోగిస్తున్నారు. రాజన్న ప్రతి పేదవాడికీ పట్టెడన్నం పెట్టేందుకు కృషి చేశారని, ఆయన ఆశయంలో భాగం పంచుకునేందుకే రాజన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నానని ఎమ్మెల్యే ఆర్కే ఆనందంగా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment