సాక్షి, అమరావతి : కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంటే కొందరు ప్రతిపక్ష నాయకులు రాజకీయాలు చేయడంపై దృష్టిసారించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓ వైపు సూక్తులు చెబుతూ.. మరోవైపు ఆయన అనుచరులతో రాజకీయం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతోపాటు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరును విమర్శిస్తూ అంబటి రాంబాబు ఓ వీడియో విడుదల చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు, అన్ని పక్షాలు పనిచేయాల్సిన సందర్భం ఇది అని అన్నారు. కానీ వారి ధర్మాన్ని మరచి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేయడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు. రాజకీయాలు మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదనే జ్ఞానం కూడా లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు అనుకూల మీడియాలో, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ కష్ట సమయంలో ప్రతిఒక్కరు ప్రజలకు అండగా నిలవాల్సి ఉందన్నారు. ఇది అయిపోయాక రాజకీయాలు మాట్లాడుదామని.. ఎవరు తప్పుచేశారో అప్పుడు ప్రజలు తేలుస్తున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్ చేస్తున్న కొన్ని ట్వీట్‌లు బాధ్యత రహితంగా ఉన్నాయని అన్నారు. వాలంటీర్ల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా పవన్ వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవుపలికారు. వాలంటీర్లు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని.. వారి పనితీరుపై ప్రశంసల వర్షం కురుస్తోందని గుర్తుచేశారు.
చంద్రబాబు శిష్యులకు మాదిరి విమర్శలు, ప్రతి విమర్శలు చేయబోమని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలుగా బాధ్యతతో కూడిన సలహాలు ఇవ్వాల్సిన సమయంలో విమర్శలుకు దిగడం దారుణమని అన్నారు. తాము ప్రచారం చేసుకోకపోవచ్చు.. కానీ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో అవసరమైన చర్యలను పకడ్బందీగా తీసుకుంటున్నాం. కరోనాపై ప్రభుత్వం తీసకుంటున్న చర్యలకు సహకరించాలని.. లేకపోతే దేశద్రోహులగా మిగిలిపోతారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment