
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే.. ఈ విషయంలో కేంద్రాన్ని లాగి రాజకీయం చేయాలనుకుంటోంది. ఈ మేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే, బాధితులకు న్యాయం చేసేలా కేబినెట్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ నేతలు అగ్రిగోల్డ్ బాధితులను రెచ్చగొడుతున్నారని, నిజంగానే వారికి ఈ విషయంలో సానుభూతి ఉంటే కేంద్రంతో చెప్పి 75 శాతం మొత్తాన్ని రాష్ట్రానికి ఇప్పించాలనే కొత్త వాదనకు తెరతీసింది. అంతేకానీ.. ఆరు రాష్ట్రాల్లోని బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలనే దానిపై ఆలోచన చేయలేదు.
అంతేకాకుండా ఇప్పటివరకు అగ్రిగోల్డ్ ఆస్తులను అధికారికంగా ప్రకటించని రాష్ట్ర ప్రభుత్వం.. ఆస్తుల విలువపై రోజుకో మాట మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఆస్తుల విలువపై క్లారిటీ ఇవ్వకుండా.. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, కేంద్రం 75 శాతం మొత్తాన్ని ఇవ్వాలనే డిమాండ్‌ను తెరమీదకు తీసుకువచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులు నిరసనలు, ధర్నాలు చేపడుతున్నా.. ఏజెంట్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై త్వరగా ఓ నిర్ణయం తీసుకునే సూచనలు కనబడటం లేదు.