సాక్షి, అమరావతి : ప్రకాశం జిల్లా టీడీపీ నేతల ఘర్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ఆయన టీడీఎల్పీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పరువు తీస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. తాను ఎవరికీ అన్యాయం చేయలేదని, కొత్త, పాత కలిసి పని చేయాలని ఎన్నోసార్లు చెప్పానని ఆయన అన్నారు. చేరికల వల్ల ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తున్నా అని, పదవులు ఇచ్చి గౌరవిస్తున్నానని, ఇంకా ఏం కావాలని అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలకు ఇంఛార్జ్‌లుగా బాధ్యతలు ఇచ్చాక జోక్యం వద్దని స్పష్టం చేశానని చంద్రబాబు పేర్కొన్నారు. చేరికల వల్ల పార్టీలో ఉన్నవారికి అన్యాయం జరగకుండా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి గౌరవించానని అన్నారు. ఇంతకంటే ఏం చేయాలని, అయినా గొడవలు పడుతూ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
కాగా ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాంల మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్న విషయం తెలిసిందే. ఇరువురు నేతలు కుర్చీలు తీసుకొని పరస్పరం దాడికి తెగబడ్డారు. సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకున్నారు. నువ్వెంతంటే.. నువ్వెంత అంటూ బాహాబాహీకి సిద్ధపడ్డారు. రాయలేని పదజాలంతో బండబూతులు తిట్టుకున్నారు.
నిన్న (గురువారం) సాయంత్రం జరిగిన ఈ గొడవకు సాక్షాత్తూ రాజధాని అమరావతిలోని సచివాలయం వేదికైంది. మంత్రులు పరిటాల సునీత, పి.నారాయణ, శిద్దా రాఘవరావుతో పాటు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు సాక్షీభూతులుగా నిలిచారు. జిల్లాలో అధికార పార్టీ గొడవలు పతాక స్థాయికి చేరాయి. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు పై విధంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment