సాక్షి, బెంగళూరు : అత్యంత ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీని కంగుతినిపించాయి. ఎగ్జిట్ పోల్స్, ప్రజాభిప్రాయ సర్వేలు కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంటుందని, హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డాయి. కానీ, ఫలితాల్లో మాత్రం బీజేపీ స్పష్టమైన మెజారిటీ దిశగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ దరిదాపుల్లో కూడా లేదు. కింగ్ మేకర్ అవుదామనుకున్న జేడీఎస్ ఆశలూ నిలబడలేదు. మొత్తానికి కన్నడ నాట కమలం వికసించడంతో కాంగ్రెస్, జేడీఎస్‌లో అంతర్మథనం మొదలైనట్టు కనిపిస్తోంది. కర్ణాటకలో ఓటమిని అధికార కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. కాంగ్రెస్ ఘోరపరాభవానికి సిద్దరామయ్యే కారణమని జేడీఎస్ నిందిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధి మంత్రమే తమను గెలిపించిందని బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు అంటున్నారు.
మొత్తానికి కాంగ్రెస్ అతి ఆత్మవిశ్వాసమే కొంపముంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కనుక జేడీఎస్‌తో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకొని ఉంటే ఇలాంటి ఫలితం వచ్చేది కాదని అంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఓటమికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్-జేడీఎస్ పొత్తు పెట్టుకొని ఉంటే.. ఫలితాలు చాలా భిన్నంగా ఉండేవని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలకు అభినందనలు తెలిపిన మమత.. ఓడినవారు ఇకనైనా మేల్కొని.. తిరిగి పోరాటానికి సన్నద్ధం కావాలని సూచించారు.
Congratulations to the winners of the Karnataka elections. For those who lost, fight back. If Congress had gone into an alliance with the JD(S), the result would have been different. Very different
— Mamata Banerjee (@MamataOfficial) 15 May 2018
Comments
Please login to add a commentAdd a comment