సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అనగానే గుర్తుకువచ్చేది.. హస్తం గుర్తు. కాంగ్రెస్ అంటే హస్తం.. హస్తం అంటే కాంగ్రెస్ అన్నంతగా ఈ ఐకానిక్ గుర్తు పెనవేసుకుపోయింది. ఇప్పుడు ఈ గుర్తును కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తాన్ని ఉపసంహరించాలని కోరుతూ బీజేపీ నేత అశ్వనీ ఉపాధ్యాయ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆ గుర్తును కేటాయించడం ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ఆయన తన ఆరు పేజీల పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఓంప్రకాశ్ రావత్, ఎన్నికల సంఘం లీగల్ అడ్వయిజర్‌ను కలిశారు.
కాంగ్రెస్ పార్టీ గుర్తును ఉపసంహరించుకోవాలంటూ ఆయన పేర్కొన్న కారణాలేమిటంటే..
- కాంగ్రెస్ ఎన్నికల గుర్తు హస్తం.. మానవ శరీరంలోని ఒక భాగం
- పోలింగ్ నాడు కాంగ్రెస్ నేతలు చేతులను ఊపుతూ.. చేతులను ఓటర్ల వైపు చూపుతూ.. ఎలక్షన్ సింబల్‌ను దుర్వినియోగం చేస్తున్నారు
- మానవ శరీరంలో విడదీయరాని భాగమైన హస్తాన్ని గుర్తుగా కేటాయించడంతో కాంగ్రెస్ నేతలు తమ గుర్తును దుర్వినియోగపరుస్తున్నారు.
- మానవ శరీరభాగానికి సంబంధించి.. ఎన్నికల గుర్తుగా ఉన్నది హస్తం మాత్రమే
- పోలింగ్‌కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని ముగించాలని ప్రవర్తనా నియమావళి స్పష్టం చేస్తోంది.
- ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం పోలింగ్ కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో ఎలక్షన్ సింబల్‌ను ప్రదర్శించడం నిషేధం
- కానీ, కాంగ్రెస్ పార్టీ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కూడా తమ గుర్తును ప్రదర్శిస్తూ దుర్వినియోగానికి పాల్పడుతోంది
Comments
Please login to add a commentAdd a comment