ఉచిత బోరు.. రైతుల కష్టాలు తీరు | Free bores But No Water Farmers Difficulties | Sakshi
Sakshi News home page

ఉచిత బోరు.. రైతుల కష్టాలు తీరు

Published Sat, Mar 30 2019 7:46 AM | Last Updated on Sat, Mar 30 2019 7:46 AM

Free bores But No Water  Farmers Difficulties - Sakshi

సాక్షి , విజయవాడ : కనుచూపు మేరలో ఎండమావులు తప్ప నీళ్లు కనపడవు. 15 వందల అడుగుల లోతున బావులు తవ్వినా జలధార జాడ కనపడదు. ఉన్న మోటబావులు ఎండిపోతున్నాయి. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక.. మండే ఎండల్ని తాళలేక పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్న ప్రజలు ఎందరో.. ఆత్మహత్యలు చేసుకున్న వారు మరెందరో. ఈ పరిస్థితి ఒక్క రాయలసీమ జిల్లాలకే పరిమితం కాదు. గోదావరి జిల్లాల్లోనూ దుర్భిక్ష పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

ప్రాణం తీసిన అప్పు 
అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఆమె పేరు గంగమ్మకు నిండా 40 ఏళ్లు కూడా లేవు. ఆమె భర్త రామానుజకు 2.75 ఎకరాల పొలం ఉంది. ఏటా వర్షాలు పడకపోవడంతో తన పొలంలో బోరు వేయించాలని నిర్ణయించుకున్నాడు. రూ.70 వేల అంచనాతో పనులు మొదలుపెట్టగా.. రూ.5 లక్షలు దాటింది. మొదటి బోరు ఫెయిలైంది. రెండు, మూడు, నాలుగు కూడా ఫెయిలయ్యాయి.

చివరి బోరులో నీరు పడినా కనకాంబరం పూల తోట ఎండిపోయింది. కారణం.. ఆ బోరు నుంచి వచ్చిన నీరు సరిపోలేదు. రామానుజ కంట నీరు ఆగలేదు. అప్పు పెరిగింది. వడ్డీ తడిసి మోపెడైంది. అంతిమంగా రామానుజ ఊపిరి ఆగింది. నిత్యం రాష్ట్రంలో ఇలా ఎందరో ఉసురు తీసుకుంటున్నారు. ఒకప్పుడు వంద, రెండు వందల అడుగులు తవ్వితే నీళ్లొచ్చేవి. ఇప్పుడు 1,500, 1,800 అడుగుల దిగువకు వెళ్లినా నీళ్లు కనిపించడం లేదు.

మరీముఖ్యంగా.. అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో ఎంత లోతుకు వెళ్లినా నీళ్లు పడటం లేదు. దీంతో అక్కడి రైతులు పదేపదే బోర్లు వేసి చేతులు కాల్చుకుంటున్నారు. చేసిన బాకీలు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఈ దుస్థితిని కళ్లారా చూసిన వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు ఓ భరోసా ఇచ్చారు.

తాము అధికారంలోకి వచ్చాక ఉచితంగా బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. ఇది అమలైతే రామానుజ లాంటి వాళ్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి రాదు. అందుకే.. లక్షలాది మంది అన్నదాతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందా అని ఎదురు చూస్తున్నారు.  

భూగర్భ జలాలే కీలకం 
వ్యవసాయంలో భూగర్భ జలాలు కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. దాదాపు 45 శాతం భూమి భూగర్భ జలాల ఆధారంగా సాగవుతోంది. 1998 నుంచి 2003 మధ్య కాలంలో భూగర్భ జలమట్టం 2.50 మీటర్లు తగ్గింది. మోట లేదా దిగుడు బావులు ఎండిపోతున్నాయి. గొట్టపు బావుల సంఖ్య పెరుగుతోంది. కోస్తాలో 64 మండలాలు, రాయలసీమలో 169 మండలాల్లో అధికంగా భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. 

వైఎస్‌ హయాంలో ఏం చేశారంటే.. 
వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో బోరుబావులు వేసుకునే రైతుల కోసం ఓ వినూత్న పథకాన్ని తీసుకొచ్చారు. ఒక వేళ బోరు విఫలమైతే బీమా పొందే అవకాశం కల్పించింది. రూ.1,200 ప్రీమియం, జియాలాజికల్‌ సర్వే కోసం మరో రూ.1,000 (చిన్న, సన్నకారు రైతులైతే రూ.500) చెల్లిస్తే సరిపోతుంది. సదరు రైతు బోరు వేసినా నీరు పడకపోతే రూ.10 వేల పరిహారం లేదా బోరు వేయడానికి అయిన వాస్తవ ఖర్చును పొందవచ్చు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ వాల్టా చట్టంలో మార్పులు చేశారు. సింగిల్‌ విండో వ్యవస్థను తీసుకువచ్చారు. పదేపదే బోర్లు వేసుకుని రైతులు నష్టాలు పాలు కాకుండా బీమా సదుపాయాన్ని కల్పించారు. 2006 జనవరి నాటికి 5,389 కొత్త బోరు బావులకు అనుమతి ఇచ్చారు. పోటీపడి పక్కపక్కనే బోర్లు వేసుకోకుండా రైతు భాగస్వామ్య వ్యవస్థను తీసుకువచ్చారు.

సంబంధిత బోరు కింద ఎంత భూమి ఉండాలో నిర్ణయించి ఆ ప్రకారం రైతులంతా నీళ్లను వినియోగించుకునే పద్ధతి ప్రవేశపెట్టారు. భూగర్భ జలాలను పెంపొందించే విధానాలను రైతులు ఆచరించేలా చేశారు. వేరుశనగ వంటి పంటల్లో తుంపర సేద్య పద్ధతిని ప్రవేశపెట్టి చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇచ్చారు.  

జగన్‌ హామీతో కలిగే మేలు ఇలా 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు ఉచిత బోర్ల పథకాన్ని ప్రకటించారు. కనీసం 300 అడుగుల లోతున బోరు వేయాలంటే అన్ని ఖర్చులతో కలుపుకుని రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఖర్చవుతుంది. ఇంత చేసినా నీరు పడకపోతే రైతులు అల్లాడిపోవాల్సిందే. ఇలా ఒకటికి రెండుసార్లు బోర్లు వేసుకుని నష్టపోతున్న వారెందరో ఉన్నారు.

ఇటువంటి దుస్థితి నుంచి రైతుల్ని కాపాడేందుకు వైఎస్‌ జగన్‌ ప్రకటించిన ఉచిత బోర్ల పథకం ఉపయోగపడుతుంది. ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుని నీరు పడేంత వరకు ఎన్నిసార్లయినా బోర్లు తవ్వుతుంది. దీనివల్ల రైతులకు ఆర్థిక భారం తప్పుతుంది. నీరూ దొరుకుతుంది. ఈ పథకంపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement