
స్టీఫెన్ రవీంద్ర , నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉత్తర, దక్షిణ తెలంగాణల్లోని పరిస్థితులను నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి, వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి గత మూడు రోజులుగా ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మావోల కదలికలు, వరుసగా వెలుగులోకి వస్తున్న పోస్టర్లు, బ్యానర్ల నేపథ్యంలో మావోయిస్టుల నియంత్రణకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఆయా జిల్లాల ఎస్పీలకు నాగిరెడ్డి సూచనలు అందిస్తున్నారు.
గత ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల దృష్ట్యా ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లను సందర్శించి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. మహారాష్ట్ర–తెలంగాణ, ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో తనిఖీలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు దక్షిణ తెలంగాణలోని రాజకీయ గొడవలు, ఫ్యాక్షన్ వాతావరణం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలీస్‌స్టేషన్ల వారీగా వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఫీల్డ్ లెవల్ సమీక్ష నిర్వహిస్తున్నారు.
నల్లగొండలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంలో జరిగిన గొడవల దృష్ట్యా ముందస్తు చర్యలపై స్థానిక అధికారులకు అవగాహన కల్పించారు. ఇక, శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అదనపు డీజీపీ జితేందర్‌తో కలసి పర్యటించారు. నామినేషన్ల ప్రక్రియ దగ్గర పడుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లతో స్టీఫెన్ రవీంద్ర సమీక్ష నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment