సర్వం దోచేశారు | IT Grids Data Scam Case SRDH Data Leak To TDP Seva Mitra App | Sakshi
Sakshi News home page

సర్వం దోచేశారు

Published Wed, Mar 6 2019 3:28 AM | Last Updated on Wed, Mar 6 2019 5:52 PM

IT Grids Data Scam Case SRDH Data Leak To TDP Seva Mitra App - Sakshi

మీరు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందించే చంద్రన్న బీమా పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారా? ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద లబ్ధి పొందాలనుకుంటున్నారా? ‘ఆరోగ్య రక్ష’ కింద ఆసుపత్రిలో చేరారా? అయితే మీ వివరాలన్నీ ప్రభుత్వం వద్దే కాదు.. టీడీపీ ‘సేవా మిత్ర’ యాప్‌లోనూ ఉన్నాయి. మీ పేరు, చిరునామా, ఫొటో, ఆధార్‌ నంబర్, సామాజికవర్గం, ఏ పార్టీ మద్దతుదారులో  సేవామిత్ర చెప్పేస్తుంది. ఇవే కాదు... మీ వ్యక్తిగత సమాచారం కూడా దేశ సరిహద్దులు దాటేసింది. ప్రభుత్వ అధీనంలో ఉండాల్సిన పౌరుల సమాచారం టీడీపీ తన రాజకీయ క్రీడకు ఉపయోగించుకుంటోంది. ఇవన్నీ ఎవరో ఆకాశరామన్న చెబుతున్న అంశాలు కావు. సాక్షాత్తూ తెలంగాణ సైబర్‌ పోలీసులతోపాటు, ఐటీ నిపుణులు వెల్లడిస్తున్న పచ్చి నిజాలు. చంద్రబాబు, లోకేశ్‌ అండ్‌ కో కనుసన్నల్లో ‘ఐటీ గ్రిడ్స్‌’ రూపొందించిన సేవామిత్ర యాప్‌ ముసుగులో జరిగిన కుతంత్రాలివి. ఒపీనియన్‌ సర్వే వివరాలతో ‘సేవామిత్ర’లో టీడీపీ మద్దతుదారులు, ఇతరులను వర్గీకరిస్తూ ‘పచ్చ’నేతలు సాగించిన కుట్రలివి. 

సాక్షి, హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ ‘సేవామిత్ర’ యాప్‌ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సమాచార సేకరణలో ఐటీ చట్టాలను తుంగలో తొక్కింది. సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన యాప్‌ కావడంతో ప్రభుత్వ వెబ్‌సైట్లలోని డేటాను యథేచ్ఛగా దోచేసింది. ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌ డాకవరం కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను పణంగా పెట్టి టీడీపీ ఈ యాప్‌ తయారీని ప్రోత్సహించిన తీరు బయట పడుతోంది. ‘సేవామిత్ర’ యాప్‌లో పౌరుల ఆధార్‌ వివరాలతోపాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వివిధ కేటగిరీలకు చెందిన ఓటర్ల వివరాలు, పార్టీలతో వారికున్న అనుబంధం మొదలైన వాటిని పొందుపరిచారు. (‘రియల్‌ టైమ్‌’తో కాజేశారు)

నియోజకవర్గాలవారీగా ఓటర్ల వివరాలతోపాటు ప్రతి ఓటరు ఏ పార్టీతో అను బంధం కలిగి ఉన్నాడో తెలిపే వివరాలు యాప్‌లో ఉన్నాయి. టీడీపీ, వైఎస్సార్‌సీపీ, జనసేన లేదా తటస్తులా అనే విషయంతోపాటు ఓటరు ఐడీలు, కులం, చిరునామా.. ఇలా ఓటరుకు సంబంధించిన పూర్తి వివరాలను యాప్‌లో పొందుపరిచినట్లు సమాచారం. ఏపీ పౌరులకు సంబంధించిన గరిష్ట సమాచారాన్ని సేకరించడం లక్ష్యంగా తయారు చేసిన ఈ యాప్‌పై ఐటీ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పదేళ్లకోసారి జరిగే జనాభా గణన సందర్భంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో సమాచారం సేకరించడం సా«ధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ సమాచారం బయటకు పొక్కితే ఇతర అక్రమాలకు ఉపయోగించే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. థర్డ్‌ పార్టీ వద్ద డేటాను నిలువ చేయడం ద్వారా డేటా తస్కరణతోపాటు హ్యాకింగ్‌కు కూడా దారి తీసే అవకాశం ఉంది. (అశోక్‌ ఐఫోనే అత్యంత కీలకం)

‘సేవామిత్ర’కు ఎస్‌ఆర్‌డీహెచ్‌ డేటా...
వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరును మెరుగు పరచడంలో భాగంగా స్టేట్‌ రెసిడెంట్‌ డేటా హబ్‌ (ఎస్‌ఆర్‌డీహెచ్‌) కోసం స్మార్ట్‌ పల్స్‌ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా ట్యాబ్‌ల ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక సమాచారాన్ని డిజిటల్‌ పద్ధతిలో సేకరించారు. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను ఆధార్‌ నంబర్‌ సహా ఎస్‌ఆర్‌డీహెచ్‌ పోర్టల్‌లో నిల్వ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో యునీక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) ఈ సమాచారాన్ని తొలగించాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఎస్‌ఆర్‌డీహెచ్‌ పోర్టల్‌లోని డేటాను ధ్వంసం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ధ్వంసం చేసినట్లుగా చెబుతున్న ఈ డేటాను ‘సేవామిత్ర’యాప్‌ రూపకల్పనలో ఉపయోగించినట్లు సమాచారం.

సుప్రీంకోర్టు రూలింగ్‌ను ఉల్లంఘించిన ‘ఐటీ గ్రిడ్స్‌’
ఆధార్‌తో అనుసంధానించిన పౌరుల వ్యక్తిగత సమాచారంతోపాటు ఓటర్ల జాబితా, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వంటి వివరాలను సేకరించిన ఐటీ గ్రిడ్స్‌.. ‘ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్‌’కు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌ను ఉల్లంఘించింది. వివిధ పద్ధతుల్లో సేకరించిన డేటాను దేశం బయట ఉన్న అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌)లో నిల్వ చేసి యాప్‌ నిర్వహణకు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అమెజాన్‌ అనుబంధ సంస్థ అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వేదికగా వ్యక్తులు, కంపెనీలు, ప్రభుత్వాలకు డేటా సేవలు అందిస్తున్న నేపథ్యంలో సేవామిత్ర యాప్‌ వివరాలు ఇవ్వాల్సిందిగా తెలంగాణ పోలీసులు ఏడబ్ల్యూఎస్‌కు లేఖ రాశారు. అలాగే ఆధార్‌ నంబర్ల దుర్వినియోగానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇవ్వాల్సిందిగా యూఐడీఏఐతోపాటు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

‘సేవామిత్ర’లో ప్రమాదకర ఫీచర్లు...
ఐటీ గ్రిడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తయారు చేసిన సేవామిత్ర యాప్‌లో అనేక ప్రమాదకర ఫీచర్లు ఉన్నట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఫోన్‌ స్లీపింగ్‌ మోడ్‌లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతోపాటు వినియోగదారులు ఎక్కడ ఉన్నదీ (యూజర్‌ లొకేషన్‌) తెలుసుకోవచ్చు. ఫోన్‌ స్టేటస్‌తోపాటు అందులోని ఫొటోలు, ఫైల్స్, ఇతర సమాచారాన్ని తెలుసుకోవడం సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. యూఎస్‌బీ స్టోరేజీ ఫైల్‌ సిస్టమ్‌లోని సమాచారాన్ని కూడా తెలుసుకోవడంతోపాటు అందులోని సమాచారాన్ని మార్పిడి చేయడం లేదా తొలగించే సామర్ధ్యం కూడా ఈ యాప్‌కు ఉంది. ఆడియో రికార్డుతోపాటు వైఫై కనెక్షన్ల వివరాలు, ఇంటర్నెట్‌ ద్వారా డేటా తస్కరణ, నెట్‌వర్క్‌ కనెక్షన్లు, బ్లూటూత్‌ ద్వారా అనుసంధానం, ఆడియో సెట్టింగ్‌లను కూడా మార్చడం వంటివి ఈ యాప్‌ ద్వారా చేయొచ్చని ఐటీ నిపుణులు చెబుతున్నారు.

చోరీ బయట పడకుండా యాప్‌ డేటా సవరణ....
ఏపీ ప్రభుత్వ డేటా తస్కరణకు సంబంధించి సైబరాబాద్‌ పోలీసులు గత నెల 21న ఐటీ గ్రిడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరక్టర్‌ అశోక్‌ డాకవరంను ప్రాథమికంగా విచారించారు. దీంతో అప్రమత్తమైన ఐటీ గ్రిడ్స్‌ ‘సేవామిత్ర’యాప్‌లోని సమాచారాన్ని గత నెల 27న కొంత మేర తొలగించడమో లేదా సవరించడమో చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఐటీ చట్టం నిబంధనలకు అనుగుణంగానే యాప్‌ డేటా ఉందనే అభిప్రాయం కలిగేలా ఓటర్ల కలర్‌ ఫొటోలు, లబ్ధిదారుల సమాచారం, ఓటరు డేటాను సవరించినట్లు గుర్తించారు. ఆ తర్వాత సంస్థ డైరక్టర్‌ అశోక్‌ పోలీసులకు అందుబాటులో లేకుండా పోయాడు. మరోవైపు పౌరుల అనుమతి లేకుండా వారికి సంబంధించిన సమాచారాన్ని యాప్‌లో ఉపయోగించడంపై మాదాపూర్‌ పోలీసులు ఈ నెల 2న ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల నేరపూరిత కుట్ర, చోరీ వంటి ఆరోపణలపై కేసు నమోదు చేశారు.

మార్చి 2, 3 తేదీల్లో సంస్థ కార్యాలయంలో తనిఖీలు చేసి కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, హార్డ్‌ డిస్క్‌లతోపాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పరికరాలను ఫోరెన్సిక్‌ విశ్లేషణ కోసం పంపించారు. తొలగించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ విధానం ద్వారా ప్రయత్నిస్తున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కొంత పురోగతి సాధించారు. అదే సమయంలో వివిధ ప్రభుత్వ వెబ్‌సైట్లకు ఐటీ సేవలు అందిస్తున్న విశాఖకు చెందిన బ్లూ ఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పాత్రపైనా పోలీసులు దృష్టి సారించారు. ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు ఎస్‌ఆర్‌డీహెచ్‌ సమాచారాన్ని బ్లూఫ్రాగ్‌ టెక్నాలజీస్‌ సమాచారాన్ని బదిలీ చేసిందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.

‘ఒపీనియన్‌ సర్వే’తో ఓట్లకు ఎసరు...
ఒపీనియన్‌ సర్వే, గ్రూప్‌ సర్వే పేరిట అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సుమారు 500 మంది బృందంతో ట్యాబ్‌ల ద్వారా ఓటర్ల వివరాలు సేకరించారు. సుమారు 80 అంశాలతో కూడిన ప్రశ్నావళిని రూపొందించి ఓటర్ల వ్యక్తిగత వివరాలతోపాటు వారి రాజకీయ ప్రాధాన్యతలు, స్థానిక సమస్యలు, రాజకీయంగా ప్రభావితం చేసే వర్గాలు, గత ఎన్నికల్లో వివిధ పార్టీల గెలుపోటములకు గల కారణాలు తదితరాలపై సమాచారం తీసుకున్నారు. ఈ సమాచారాన్ని హైదరాబాద్‌ మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్‌ సంస్థ క్రోడీకరించింది. ఈ డేటా విశ్లేషణ ఆధారంగా టీడీపీ, వైఎస్సార్‌సీపీ, జనసేన తదితర పార్టీల మద్దతుదారులు, తటస్థులపై అంచనాకు వచ్చారు. డేటాను క్షేత్రస్థాయి టీడీపీ నాయకులకు అప్పగించి తటస్థులు, టీడీపీ పాలనపై వ్యతిరేకతతో ఉన్న వారిని తమ వైపు మరల్చడం లేదా ఓటరు జాబితాలో వారి పేర్లను తొలగించేలా కుట్ర పన్నారు. 

లక్షలాది ఓట్లు తొలగించేలా కుట్ర...
ఏపీలో సుమారు 3.69 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఓటరు జాబితా సవరణలో భాగంగా కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఓట్ల తొలగింపు కోరుతూ 13.16 లక్షల దరఖాస్తులు అందాయి. అంటే మొత్తం ఓటర్లలో సుమారు 3.7 శాతం మంది ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారీగా ఓట్ల తొలగింపు కోరుతూ దరఖాస్తులు అందడంతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ (ఐపీ) అడ్రస్‌ ఆధారంగా ఓట్ల తొలగింపు కోరుతూ అందిన దరఖాస్తులపై విచారణ జరపాలని జిల్లా ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐటీ చట్టం నిబంధనల ప్రకారం ఫిర్యాదులు చేయగా ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఏపీవ్యాప్తంగా ఇప్పటికే 50కి పైగా కేసులు నమోదయ్యాయి. ఓట్ల తొలగింపు కోసం ఉపయోగించే ఫారం–7 ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో ఒక్కో మండలంలో సుమారు 1,000 నుంచి 1500 ఓట్ల తొలగింపు దరఖాస్తులు అందినట్లు సమాచారం. ఐటీ గ్రిడ్స్‌ క్రోడీకరించిన సమాచారం ఆ«ధారంగానే ఓట్ల తొలగింపునకు తెరలేచినట్లు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. 

క్యాష్‌ ఫర్‌ ట్వీట్‌తో తంటాలు...
ఐటీ గ్రిడ్స్‌ వ్యవహారంలో పోలీసుల విచారణ ఊపందుకోవడంతో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌ కొత్త పల్లవి అందుకున్నారు. ‘తెలుగుదేశం పార్టీ డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసి వైఎస్సార్‌సీపీకి అందజేసింది’అంటూ ఉల్టా ప్రచారం ప్రారంభించారు. పోలీసు విచారణకు హాజరై కడిగిన ముత్యంలా బయటకు రావాలని టీఆర్‌ఎస్‌ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌.. చంద్రబాబు, లోకేశ్‌కు హితవు పలికినా గోబెల్స్‌ ప్రచారంలో సిద్ధహస్తులైన చంద్రబాబు, లోకేశ్‌ మాత్రం ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, వైఎస్‌ జగన్‌పై ‘క్యాష్‌ ఫర్‌ ట్వీట్‌’కు తెరలేపారు. ఐటీ గ్రిడ్స్‌ వ్యవహారంతో సంబంధంలేని రాష్ట్రేతర వ్యక్తులతో ట్వీట్లు చేయిస్తూ ఇతరులపై బురద చల్లడంలో నిమగ్నమయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement