కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు(కల్వకుర్తి) : కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పోటీచేయనున్నారు. ఈ మేరకు ఆయన తన అనుచరులకు సంకేతాలు ఇచ్చారు. మాడ్గుల మండలం కొల్కులపల్లి గ్రామం నుంచి గురువారం కసిరెడ్డి నారాయణరెడ్డి పరోక్షంగా ప్రచారం ప్రారంభించారు. కల్వకుర్తి అసెంబ్లీ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను పార్టీ ప్రకటించడంతో కసిరెడ్డి నారాయణరెడ్డి మనస్థాపానికి గురయ్యారు. మంత్రి కేటీఆర్ స్వయంగా బుజ్జగించినా ఆయన మెత్తబడలేదు. తన అనుచరుల ఒత్తిడితో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కసిరెడ్డి సిద్ధమయ్యారు.
ఎమ్మెల్సీగా విస్తృత పర్యటనలు
కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన కసిరెడ్డి నారాయణరెడ్డి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ వెంటనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించారు. నియోజకవర్గంలో తనకంటూ ఒక వర్గాన్ని కసిరెడ్డి నారాయణరెడ్డి ఏర్పాటు చేసుకున్నారు.
టికెట్ రాకపోవడంతో...
ఈ ఎన్నికల్లోనూ కల్వకుర్తి నుంచి పోటీ చేయడానికి కసిరెడ్డి నారాయణరెడ్డి ఆసక్తి చూపించారు. కానీ టీఆర్‌ఎస్ అధిష్టానం టికెట్‌ను జైపాల్‌యాదవ్‌కు కేటాయించింది. అప్పటి నుంచి కసిరెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రచారంలో కూడా పాల్గొనడం లేదు. అయితే, రెండు మూడు రోజులుగా నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి ముఖ్యనాయకులతో కసిరెడ్డి రహస్య సమావేశాలు నిర్వహించి అనుచరుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment