
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు వెళ్లే వ్యూహంలో భాగంగా అసెంబ్లీని రద్దు చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 105 మంది అభ్యర్థులతో కూడిన టీఆర్‌ఎస్ జాబితాను ప్రకటించారు. దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ ఈ జాబితాలో చోటు దక్కింది. కాగా వివాదాల్లో ఉన్న నేతలకు కూడా టికెట్ ఖారారు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. భూ వివాదంలో చిక్కుకున్న జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మరో అవకాశమిచ్చిన కేసీఆర్.. జర్మనీ పౌరసత్వం విషయంలో చట్ట పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ను అభ్యర్థిగా ప్రకటించి ఆశ్చర్యపరిచారు. వీరితో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్ట మధు, శంకర్ నాయక్, తాటికొండ రాజయ్యలకు కూడా అవకాశమిచ్చారు. ఇక, కాంగ్రెస్ నేత డీకే అరుణ సోదరుడు చిట్టం రామ్మోహన్ రెడ్డికి మక్తల్ నుంచి పోటీచేసే అవకాశం కల్పించారు. కాగా బాబూమోహన్, నల్లాల ఓదేలు తదితర సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయిచూపిన కేసీఆర్... పార్టీ మారిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్ ఖరారు చేయడం విశేషం.
ఒకే కుటుంబంలో ఇద్దరికి..
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా.. ఆయన తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావులు సిట్టింగ్ స్థానాల నుంచి పోటీ చేయనుండగా.. రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఇద్దరికి అవకాశం దక్కింది. తాండూరు నుంచి పట్నం మహేందర్ రెడ్డికి టికెట్ ఖరారు కాగా.. ఆయన సోదరుడు నరేందర్ రెడ్డి కొడంగల్ నియోజక వర్గం నుంచి పోటీచేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment