
రజనీకాంత్
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయ నాయకులెవ్వరూ తన అభిమానులకు పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని, వారే ఎదుటి వారికి పాఠాలు చెప్పగల నేర్పులని నటుడు రజనీకాంత్ విమర్శకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చెన్నైలో ప్రజా సంఘాల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. 32 ఏళ్ల చరిత్ర కలిగిన అభిమాన సంఘాల నుంచి తమ పార్టీ ఉద్భవిస్తోందని, తాము ఇప్పుడు చేయాల్సిందల్లా వాటిని మరింత బలోపేతం చేయడమేనని అన్నారు. జిల్లాల్లో ఇన్‌చార్జ్‌ల నియామకం పూర్తయ్యాక రాష్ట్ర పర్యటన చేపడతానన్నారు.
కమల్ సమర్థుడు..
ఇటీవల పార్టీ స్థాపించిన సహ నటుడు కమల్ హాసన్‌పై రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. కమల్ సమర్థుడని, ఆయన ప్రజల విశ్వాసం చూరగొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రాబోతున్న తనది, కమల్‌ది రెండు వేర్వేరు దారులని, అయినా ఇద్దరి అంతిమ లక్ష్యం ప్రజా సంక్షేమమేనని అన్నారు.