సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్‌ఎస్ వ్యూహాలను పసిగడుతున్న కాంగ్రెస్ అప్రమత్తమవుతోందా ? టీఆర్‌ఎస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలను రచిస్తోందా ? సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు కాంగ్రెస్ ముందస్తు కసరత్తు మొదలు పెట్టిందా..? కాంగ్రెస్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తున్న రాజకీయ పరిశీలకులు పై ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నాటినుంచి టీఆర్‌ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లాపై పట్టు సాధించలేక పోయింది. అప్పుడు కేవలం ఆలేరు స్థానానికే పరిమితమైంది. కానీ, రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మొదటిసారి ఆరు స్థానాలు గెలుచుకుంది. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లను గెలచుకోగా, నల్లగొండ పార్లమెంటు స్థానం పరిధిలో మాత్రం కేవలం ఒక్క సూర్యాపేటకే పరిమితమైంది. దీంతో ఈసారి జరగనున్న ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రణాళికలు తయారు చేసుకున్న టీఆర్‌ఎస్ నల్లగొండ ఎంపీ స్థానానికి ఓ ముఖ్య నేతను బరిలోకి దింపడం ద్వారా అసెంబ్లీ స్థానాలను కొల్లగొట్టాలని చూస్తోంది. వీరి వ్యూహాలను పసిగట్టిన కాంగ్రెస్ అదే స్థాయిలో ప్రతివ్యూహం రచించుకుంటోంది.
కాంగ్రెస్‌లో ‘కోమటిరెడ్డి ప్రకటనల చర్చ !
పార్లమెంటు సీటులో బలమైన అభ్యర్ధిని నిలబెడితే ఆ ప్రభావం ఆ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లపై ఉంటుందని టీఆర్‌ఎస్ భావిస్తున్న మాదిరిగానే కాంగ్రెస్ సైతం అదే అభిప్రాయంలో ఉన్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గాలి వీచినా.. కాంగ్రెస్ నల్లగొండ ఎంపీ స్థానాన్ని రెండు లక్షల మెజారిటీ ఓట్లతో గెలుచుకుంది. అలా గెలిచిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్‌ఎస్ గూటికి చేరడంతో కాంగ్రెస్ ఈసారి మరో బలమైన అభ్యర్థిని వెతుక్కోవాల్సి వస్తోంది. ఈ ఎంపీ స్థానం పరిధిలోనే సీఎల్పీ నేత జానారెడ్డి, టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జునసాగర్, హుజూర్‌నగర్, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి నియోజకవర్గం నల్లగొండ ఉన్నాయి. దీంతో ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి బలహీనుడైతే సీనియర్లు ఉన్న అసెంబ్లీ సీట్లపైనా దాని ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. ఇది గమనించే సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తానే నల్లగొండ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని, ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రకటన కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఆ ప్రకటన ఆయన వ్యక్తిగతంగా చేసిందా, లేక కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంలో భాగంగా చేసిందా అన్న స్పష్టత రావాల్సి ఉంది. మరో వైపు నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీని శాసన మండలికి పంపిస్తామని కూడా ఆయన ప్రకటించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంపీ స్థానానికి పోటీ చేస్తే అసెంబ్లీ స్థానానికి అభ్యర్థి ఎవరనే ప్రశ్న కాంగ్రెస్ శిబిరంలో వ్యక్తమవుతోంది. కోమటిరెడ్డి చేసిన ప్రకటనలను టీ పీసీసీ కూడా అధికారికంగా ధ్రువీకరించి ప్రకటిస్తే నల్లగొండ రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిరేపడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, కాంగ్రెస్‌లో జరుగుతున్న ఈ పరిణామలంటినీ నిశితంగా పరిశీలిస్తున్న అధికార టీఆర్‌ఎస్ నాయకత్వం గుంభనంగా ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment