
చెన్నై : తనకు వీఐపీ భద్రతను తొలగించడంపై డీంఎకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ స్పందించారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ బలగాలకు కృతజ్ఞతలు తెలిపిన స్టాలిన్.. వారిని యూనివర్సిటీలను, విద్యార్థులను రక్షించడానికి వినియోగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘చాలా కాలంగా నాకు భద్రత కల్పించిన సీఆర్పీఎఫ్ అధికారులకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే మతం పేరిట హింసకు పాల్పడేవారి నుంచి యూనివర్సిటీలను, విద్యార్థులను రక్షించడానికి సీఆర్పీఎఫ్ అధికారులను వినియోగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని స్టాలిన్ పేర్కొన్నారు.
మరోవైపు డీఎంకే శ్రేణులు స్టాలిన్‌కు వీఐపీ భద్రతను తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్టు డీఎంకే ఎంపీ కనిమొళి ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, స్టాలిన్‌తోపాటు తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు కేంద్ర బలగాల భద్రతను ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్రం గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు స్టాలిన్‌కు జెడ్ ప్లస్, పన్నీర్ సెల్వంకు వై ప్లస్ సెక్యూరిటీ ఉండేది. ఇకపై వీరి భద్రతను రాష్ట్ర పోలీసులు చూసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment