
సాక్షి, చిత్తూరు: సీఎం చంద్రబాబు అబద్ధపు హామీలతో రైతులను నట్టేట ముంచారని వైఎస్సార్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే నీళ్లు ఇస్తామని మాట తప్పారని అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును వైఎస్ రాజశేఖరరెడ్డి 80 శాతం పూర్తిచేస్తే మిగిలిన 20 శాతం పనులను కూడా చంద్రబాబు పూర్తిచేయలేకపోయారని తెలిపారు. తన హెరిటేజ్ డెయిరీ కోసం రైతులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదయితే, లీటర్ పాలకు 4 రూపాయల ప్రోత్సాహకం ప్రకటించిన ఘనత వైఎస్ జగన్‌దని పేర్కొన్నారు.
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర రోజు రోజుకు ప్రజల మద్దతు పెరుగుతోందని మిథున్‌రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు.
కాగా, తాము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ డెయిరీలకు రైతులు అమ్మే ప్రతి లీటరు పాలకు నాలుగు రూపాయల సబ్సిడీ ఇస్తామని, ప్రభుత్వ రంగంలో మూతపడిన పాల ఫ్యాక్టరీలన్నింటినీ తిరిగి తెరిపిస్తామని వైఎస్ జగన్ హామీయిచ్చారు.