మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి బి. కిషోర్‌కుమార్ తదితరులు
కడప కార్పొరేషన్ : బీజేపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీ వర్గాలపై దాడులు పెరిగిపోయాయని, మహిళలు, పిల్లల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బి. కిషోర్ కుమార్ ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జమ్ముకాశ్మీర్‌లో 8 ఏళ్ల ఆసిఫాను ఆరుగురు వ్యక్తులు దేవాలయంలో బంధించి అత్యాచారం చేసి హత్య చేయడం అత్యంత కిరాతకమన్నారు. ఆ సంఘటనకు మతం రంగు పులిమి దోషులకు మద్దతుగా న్యాయవాదులు, బీజేపీ మంత్రులు ర్యాలీ చేయడంపై ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. దేశంలో సాగుతున్న రాక్షస పాలనకు ఇది ప్రత్యక్ష నిదర్శనమన్నారు.
ఆసిఫాపై లైంగిక దాడికి పాల్పడిన వారిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. దళితులకు ఉక్కు కవచం లాంటి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీం కోర్టు మార్పులు చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. సుప్రీం తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో 25 మంది చనిపోతే, ప్రభుత్వం 11 మంది మాత్రమే చనిపోయినట్లు చెబుతోందన్నారు. దేశంలో జరుగుతున్న ఈ పరిణామాలపై కలిసి వచ్చే అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలను కలుపుకొని ఈనెల 23వ తేది సోమవారం సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఆ సదస్సులో అన్ని అంశాలపై చర్చించి ఆందోళనా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామని తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్(బూస్ట్), దళిత నాయకులు ఎం.సుబ్బరాయుడు, పీజీ గంగయ్య, పి.శ్రీనివాసులు, కె. మునెయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment