
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మాజీమంత్రి అశోక గజపతిరాజు సోదరుడి కుమార్తె, బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలు సంచిత హర్షం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ఆమె అన్నారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సంచిత గజపతిరాజు.. అభివృద్ధి వికేంద్రీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వెనుకబడిన కర్నూల్‌లో హైకోర్టు, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అని పేర్కొన్నారు. రాజధాని పేరుతో రైతుల వద్ద చంద్రబాబు నాయుడు బలవంతంగా లాకున్న భూమిని తిరిగి ఇచ్చేయాలని ఆమె డిమాండ్ చేశారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నా.. చంద్రబాబు ముందే ఎందుకు పారిపోయి వచ్చారని ఆమె ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ రాజధానిపై పూర్తి నివేదిక ఇవ్వకుండానే అమరావతి నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం సిద్ధపడిందని సంచిత ఆరోపించారు. అమరావతి అనేది చట్టవిరుద్ధం నిర్ణయమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా.. చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని విమర్శించారు. టీడీపీని ప్రజలు ఎప్పడో తిరస్కరించారని, రాజధానిపై మాట్లాడే కనీస హక్కు చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు లేదని అన్నారు. అలాగే అమరావతి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను సంచిత ప్రశంసించారు. రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పడూ సహకారంగా ఉంటారని, దీనిలో రాజకీయం చేసే దురాలోచన ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. కాగా రెండేళ్ల క్రితమే ఆమె బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment