సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి రావాలన్న కాంక్ష ఉన్నా.. అందుకు తగిన వనరులున్నా.. కాంగ్రెస్ నేతల మధ్య అనైక్యతే ఆ పార్టీని దెబ్బతీస్తోందని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయ పరిణామాలను, అవకాశాలను అందిపుచ్చుకోలేక పోతోందని చెబుతున్నాయి. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చే సీనియర్ నేతలను చేర్చుకోవడంలో ‘స్థానిక’ రాజకీయాలు అడ్డుగా నిలుస్తున్నాయని అంటున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు పొందిన మహబూబ్‌నగర్ జిల్లా నేత నాగం జనార్దన్‌రెడ్డి ఎపిసోడ్ ఇందుకు తాజా నిదర్శనంగా నిలుస్తోందని కాంగ్రెస్ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్‌లోకి నాగం జనార్దన్‌రెడ్డి చేరికను మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో కొద్దినెలలుగా నాగం చేరిక అంశం నానుతూనే ఉంది. అయితే ఆయనను చేర్చుకోవడంపై ఓ అవగాహనకు వచ్చిన ఏఐసీసీ పెద్దలు.. నాగం రాకను వ్యతిరేకిస్తున్న నేతలను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించే పనిలో పడ్డారు. ఈ నెల 27 లేదా 28న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ పాలమూరు జిల్లా బృందంతో ఢిల్లీ వెళ్లి కొప్పుల రాజు, కుంతియాలతో సమావేశం కానున్నట్టు టీపీసీసీ వర్గాలు తెలిపాయి.
రెండు వర్గాలుగా చీలిక..?
నాగం చేరిక విషయంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ వర్గం వ్యతిరేకతతో ఉంది. రెండు నెలల కింద ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిలతో కలసి ఢిల్లీ వెళ్లిన అరుణ.. నాగం చేరిక పట్ల తన వ్యతిరేకతను రాహుల్‌గాంధీకి వివరించినట్టు సమాచారం. తాజా గా నాగం బీజేపీకి రాజీనామా చేయడంతో.. ఆయన కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం మళ్లీ మొదలైంది. దీంతో పాలమూరు జిల్లా కాంగ్రెస్ రెండుగా విడిపోయింది. నాగం చేరికను ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. డీకే అరుణ వర్గాన్ని బలహీనం చేసేందుకు జైపాల్‌రెడ్డి ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఆ జిల్లా ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాత్రం.. నాగం లాంటి చరిష్మా ఉన్న నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకోవాల్సిందేనని, అవసరమైతే జిల్లాకు చెందిన మరోనేత రావుల చంద్రశేఖర్‌రెడ్డినీ తీసుకోవాలని అంటున్నారు. మొత్తంగా పాలమూరు జిల్లా రాజకీయం మరింత వేడెక్కింది.
రాజీ కుదుర్చేందుకే..!
నాగం చేరికపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు ఢిల్లీ నుంచి కబురు అందిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. డీకే అరుణ వర్గంతో ఏఐసీసీ పెద్దలు మాట్లాడనున్నారని, నాగం చేరిక అనంతరం పార్టీలో అరుణ వర్గానికి ప్రాధాన్యం వంటి అంశాలపై చర్చిస్తారని చెబుతున్నాయి. మొత్తంగా ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చి నాగం చేరికకు లైన్ క్లియర్ చేస్తారని అంటున్నాయి. ఈ మేరకు త్వరలో రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన ఉంటుందని చెబుతున్నాయి.
ఖమ్మం, నల్లగొండల్లోనూ ఇదే పరిస్థితి
మరోవైపు ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనూ మహబూబ్‌నగర్ తరహా పరిస్థితే ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అక్కడ కూడా ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతలు రాకుండా స్థానిక కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారముంది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారని, ఖమ్మం లోక్‌సభ టికెట్ ఇస్తే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు. కానీ నామా చేరికపై ఎంపీ రేణుకాచౌదరి వ్యతిరేకతతో ఉన్నారన్న ప్రచారముంది. ఇక జిట్టా బాలకృష్ణారెడ్డి విషయంలోనూ ఇదే పరిస్థితి ఉందని సమాచారం. నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ కొందరు గుర్తింపు ఉన్న నేతల చేరికలకు స్థానిక పరిస్థితులు అడ్డుపడుతున్నట్టు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment