సంకటంలో సెంథిల్‌ | Senthil Balaji relatives, friends, Income tax raid 4th day | Sakshi
Sakshi News home page

సంకటంలో సెంథిల్‌

Published Mon, Sep 25 2017 5:16 AM | Last Updated on Mon, Sep 25 2017 5:16 AM

Senthil Balaji relatives, friends, Income tax raid 4th day

అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే సెంథిల్‌ బాలాజీ సంకట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. కోట్లాది రూపాయల మేరకు పన్ను చెల్లించకుండా మోసానికి పాల్పడ్డట్టుగా ఆదాయ పన్నుశాఖ వర్గాలు గుర్తించినట్టు సమాచారం. సోదాల్లో పెద్ద ఎత్తున బంగారం, నోట్ల కట్టలు బయటపడ్డట్టుగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నాలుగో రోజు విచారణ ముగించిన అధికారులు 35 మందికి సమన్లు జారీచేయడానికి తగ్గ కసరత్తులో ఉన్నట్టు సమాచారం.

సాక్షి, చెన్నై: మాజీ మంత్రి, అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే సెంథిల్‌ బాలాజీని గురిపెట్టి సాగుతున్న ఐటీ దాడుల గురించి తెలిసిందే. రాష్ట్రంలో ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో ఒకే వ్యక్తిని గురిపెట్టి ఏకంగా నాలుగు రోజుల పాటు ఆదాయ పన్ను శాఖ వర్గాలు దాడులు నిర్వహించడం గమనించదగ్గ విషయం. నిన్నటివరకు  కరూర్‌ జిల్లాలో ముప్ఫై చోట్ల ఆదాయ పన్ను శాఖవర్గాలు తనిఖీలు సాగించాయి. నాలుగో రోజు  ఆదివారం కూడా సోదాలు కొనసాగాయి. సెంథిల్‌ బాలాజీకి అత్యంత సన్నిహితులుగా ఉన్న మిత్రులు, కళాశాలల అధిపతి, పలు సంస్థలకు యజమాని, కాంట్రాక్టర్లు త్యాగరాజన్, నవరంగ్‌ సుబ్రమణియన్, శంకర్‌ల చుట్టూ నాలుగో రోజు విచారణ సాగాయి. ఇందులో శంకర్‌కు చెందిన కార్యాలయాన్ని ఏకంగా అధికారులు సీజ్‌ చేయడం చర్చకు దారితీసింది.

రూ.వంద కోట్లకు పైగా పన్ను ఎగవేత
ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న సెంథిల్‌ బాలాజీ మరింత సంకట పరిస్థితుల్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లల్లో మొత్తంగా 35 చోట్ల దాడులు నిర్వహించారు. ఇందులో కోట్లాది రూపాయల మేరకు పన్ను ఎగవేత వ్యవహారం వెలుగులోకి వచ్చినట్టు ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. వంద కోట్ల మేరకు ఎగవేసి ఉండవచ్చని భావిస్తున్నా, దానిని దాటే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అలాగే, మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అక్రమార్జనగా వచ్చిన రూ.ఐదు కోట్లకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, రూ.1.20 కోట్ల నగదుతో పాటు బంగారు ఆభరణాలను సైతం ఈ దాడుల్లో ఐటీ వర్గాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆదివారం నాటికి విచారణను ముగించిన అధికారులు , పెద్దఎత్తున తమకు లభించిన వాటన్నింటినీ వాహనాల్లో తరలించారు. ఇక, సెంథిల్‌ మిత్రుడు శంకర్‌ కార్యాలయం నుంచి రెండు సూట్‌కేసులను తీసుకెళ్లడంతో అందులో నోట్ల కట్టలు ఉన్నట్టు సమాచారం.

బిగుస్తున్న ఉచ్చు
ప్రస్తుతానికి అధికారులు దాడుల్ని ముగించినా, విచారణ కొనసాగించే విధంగా ఐటీ వర్గాలు పరుగులు తీస్తుండడంతో సెంథిల్‌ బాలాజీ మెడకు ఉచ్చు రోజురోజుకు బిగిసే అవకాశాలు ఎక్కువే. ప్రస్తుతం దాడులు జరిగిన ప్రాంతాల్లో లభించిన వాటన్నింటికి వివరాలు, ఆధారాలను సేకరించే విధంగా విచారణ సాగనున్నట్టు ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకోసం ఆయా ప్రాంతాలకు చెందిన ముప్ఫై ఐదు మందిని విచారించేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా సెంథిల్‌ బాలాజీ సన్నిహితులు ముగ్గుర్ని తొలుత తమ విచారణ పరిధిలోకి తీసుకొచ్చి విధంగా సమన్లు సిద్ధం చేస్తుండడం గమనార్హం. అలాగే, సెంథిల్‌ బాలాజీకి సైతం సమన్లు జారీ చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. కాగా, పెద్ద ఎత్తున నగదు, నగలు  పట్టుబడిన నేపథ్యంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వర్గాలు, గతంలో సాగిన అవినీతిపై ఏసీబీ దృష్టి సారించి, సెంథిల్‌ను కటకటాల్లోకి నెట్టే రీతిలో దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement