కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు గురించి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని శాసనమండలి ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో హైకమాండ్‌తో చర్చిస్తామని, అప్పుడు మా అభిప్రాయాలు చెబుతామని, టీపీసీసీ మార్పు కూడా ఉండకపోవచ్చునని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ స్టాండ్ ఏంటని టీఆర్‌ఎస్ మంత్రులు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు.
విభజన సమయంలో కేసీఆర్, ఏపీకి బంగారం ఇవ్వండి, ఇంకేమైనా ఇవ్వండి అన్నారు..ఈ మాటలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఎంపీ కవిత జై ఆంధ్ర అన్న విషయం, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అన్న విషయం గుర్తుకు రాలేదా అని సూటిగా అడిగారు. తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ స్టాండ్ ఏంటని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని, ఎన్నికలు వస్తే తలసాని సంగతి ప్రజలు తేలుస్తారని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలోని అంశాలను టీఆర్‌ఎస్ అధినేత, ఎంపీలు ఎప్పుడైనా అడిగారా? హామీల సాధనపై ఆల్ పార్టీని ఢిల్లీకి తీసుకెళ్లారా అని సూటిగా ప్రశ్నించారు.
మొన్నటి వరకు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అని చెప్పి ఇప్పుడు మిన్నకుండి పోయారు..అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసాక తెలంగాణకు ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ తీసుకుంటున్న యూటర్న్‌ను ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల కోసమే టీఆర్‌ఎస్ మళ్లీ సెంటిమెంట్ రగిలించాలని చూస్తోందని విమర్శించారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం పూర్తి చేయాలనేదే కాంగ్రెస్ స్టాండ్..డిమాండ్ అని షబ్బీర్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment