నలుగురు ఎంపీలది ఫిరాయింపే  | TDP Leaders Comments On Those Four MPs Party Defection | Sakshi
Sakshi News home page

నలుగురు ఎంపీలది ఫిరాయింపే 

Published Sun, Jun 23 2019 4:44 AM | Last Updated on Sun, Jun 23 2019 5:35 AM

TDP Leaders Comments On Those Four MPs Party Defection - Sakshi

సాక్షి, అమరావతి: నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం ఫిరాయింపేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు తెలిపారు. తాజా రాజకీయ పరిణామాలపై ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో శనివారం ఆయన అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యసభలో మెజారిటీ కోసమే బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని విమర్శిం చారు. ప్రజావేదికలో చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తిగత సామగ్రిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బయట పెట్టడం సరికాదన్నారు. ప్రతిపక్ష నేతగా ఉండవల్లిలోని ప్రజావేదికను వాడుకునేందుకు తనకు కేటాయించాలని చంద్రబాబు లేఖ రాశారని, దీనిపై సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కక్ష సాధింపేనని విమర్శించారు. ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ నలుగురు ఎంపీల విలీనం అనైతికం, అప్రజాస్వామికమేనన్నారు. దీనిపై న్యాయ పోరాటానికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.

నీతివంతమైన పాలన అందిస్తామని చెప్పిన బీజేపీ.. టీడీపీ ఎంపీలను చేర్చుకోవడం తప్పేనని మాజీ మంత్రి దేవినేని ఉమా తప్పుబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రుణమాఫీ మిగిలిన విడతలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విడుదల చేయాలని యనమల పేర్కొన్నారు. ప్రభుత్వం తన ప్రాధాన్యతలు నెరవేరుస్తూనే గత ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను కొనసాగించాలన్నారు. ఇదిలా ఉండగా బీజేపీలోకి వెళతారని ప్రచారం జరగుతుండడంతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును ఈ సమావేశానికి ప్రత్యేకంగా పిలిచారు. కొందరు నేతలు పార్టీ మా ర్పు గురించి అడగ్గా ఆయన సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం. చంద్రబాబుతో మాట్లాడాలని, టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడాలని చెప్పినా తాను వ్యక్తిగతంగా మాట్లాడతానని చెప్పి  వెళ్లిపోయినట్లు తెలిసింది. మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్లిపోవ డం చర్చనీయాంశమైంది. సమావేశంలో ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, ఎమ్మెల్సీలు, వీవీవీ చౌదరి, బాబూ రాజేంద్రప్రసాద్, అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేశ్, శ్రావణ్‌కుమార్‌లు పాల్గొన్నారు.  

చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌  
ఇదిలా ఉండగా తాజా రాజకీయ పరిణామాలపై విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం సరికాదని ప్రచారం చేయాలని, దీనిపై నేతలందరూ మీడియా సమావేశాలు పెట్టాలని ఆయన సూచించినట్లు 
తెలిసింది.  

ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ ఓవర్‌ యాక్షన్‌  
ఉండవల్లిలోని కృష్ణా నది కరకట్ట దిగువన ఉన్న ప్రజావేదిక వద్ద టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ కాసేపు ఓవర్‌ యాక్షన్‌ చేశారు. కలెక్టర్ల సమావేశం నిమిత్తం ప్రజావేదికలో  ఏర్పాట్లు చేస్తుండగా అక్కడకు వచ్చిన రాజేంద్రప్రసాద్‌.. చంద్రబాబు సామాన్లు, టీడీపీ కార్యాలయం నమూనాను ఎవరు బయట పెట్టారని అధికారులను ప్రశ్నించారు. తమ అనుమతి లేకుండా వస్తువులు ఎలా బయటపెడతారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు.

తాము నిబంధనల ప్రకారమే విధులు నిర్వహిస్తున్నామని అధికారులు సమాధానం చెప్పారు. గతంలో కలెక్టర్ల సమావేశం ప్రజావేదికలో జరిగేదని, ఇప్పుడు కూడా అలానే ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్పుకొచ్చారు. అనంతరం రాజేంద్రప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం పెడితే ఇబ్బందవుతుందని తెలిపారు. ఇక్కడ రోడ్లు, స్థలం ఇరుకుగా ఉంటాయన్నారు. చంద్రబాబు కట్టిన ప్రజావేదికలోనే కలెక్టర్ల సమావేశం పెట్టలా.. వేరే చోట పెట్టుకోకూడదా అని ప్రశ్నించారు. ఒకప్పుడు ప్రజావేదిక జర్నలిస్ట్‌లకు షెల్టర్‌గా ఉండేదని చెప్పగానే, విలేకరులు ఆయన మాటలకు అడ్డుపడుతూ.. తమని ఎన్నడూ ప్రజా వేదికలోకి రానివ్వలేదన్నారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement