సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్ష పార్టీని అణిచి వేసేందుకు అధికార పార్టీ కుట్రలు చేస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజాకోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ బుధవారం మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, అవమానించినా దృఢ సంకల్పంతో వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారని అన్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు రాయిస్తూ అధికార పార్టీ గ్లోబల్ ప్రచారం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు మంచి సంక్షేమ ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారని, రాజన్న రామరాజ్యాన్ని వైయస్ జగన్ తీసుకువస్తారని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు బొత్స తెలిపారు. ఇందుకు ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న స్పందనే నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో దళిత మహిళపై జరిగిన ఘటనను బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు.
టీడీపీ పాలనలో దళితులపై వివక్ష
పెందుర్తిలో మహిళపై జరిగిన ఘటన సభ్య సమాజం సిగ్గుపడేటట్లు, తలదించుకునేటట్లుగా ఉందని బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధ్యుతలపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా, దోషులను రక్షించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా దళితులపై వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అంశాల్లో వివక్ష చూపుతున్నారని బొత్స మండిపడ్డారు. ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. తమ పార్టీ తరఫున వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగు నాగార్జున, స్థానిక నాయకులను పెందుర్తి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించాలని వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారన్నారు.
ఆ మూడు అక్షరాలే..
వైఎస్‌ఆర్ అనే మూడు అక్షరాలు ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 9 కోట్ల మంది హృదయాల్లో చెరగని ముద్రగా ఉన్నాయని బొత్స సత్యనారాయణ అన్నారు. మహానేత ఆశయ సాధనకు ఆయన తనయుడు వైఎస్ జగన్ నాయకత్వంలో ఏర్పాటైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకత్వంతో కళకళలాడుతోందన్నారు. రాష్ట్రానికి వైళెస్ జగన్‌తో మంచి భవిష్యత్తు ఉందని అందరూ నమ్ముతున్నారని తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అధికార పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా..దృఢ సంకల్పంతో వైఎస్‌ఆర్ స్ఫూర్తితో, ఆయన మాదిరిగా పాలనను మళ్లీ తీసుకురావాలని వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలోని ఆనాటి 9 కోట్ల మంది ప్రజలు వైఎస్‌ఆర్ అనే మాట వినగానే ఫర్వాలేదు మాకు ఈ మూడు అక్షరాలు ఉన్నాయని, మాకు రాజన్న ఉన్నాడని ధైర్యంగా ఉండేవారన్నారు. అదే మూడు అక్షరాలను చూసి టీడీపీ శ్రేణులు ప్రజల్లో ఆ పేరును భగ్నం చేయాలని కుట్రలు చేశారు. మళ్లీ అదే మూడు అక్షరాలు జగన్.....తండ్రికి తగ్గ తనయుడిగా ఉండాలనే కోరికతో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజల వద్దకు వెళ్లారని, మళ్లీ ఆ రాజన్న రాజ్యం తెస్తానని చెబుతున్న నేపథ్యంలో ఆ నాయకత్వాన్ని బలహీనపరచాలని అధికార టీడీపీ ధన మదంతో అప్రజాస్వామ్య పద్దతిలో రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొంటూ, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ వ్యక్తిగతంగా వైఎస్ జగన్ అనే మూడు అక్షరాలపైన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు రాయిస్తూ, సోషల్ మీడియాలో చేయిస్తున్నారని మండిపడ్డారు. గ్లోబల్ ప్రచారం మాదిరిగా జగన్‌పై విష ప్రచారం చేస్తున్నారన్నారు.
బాబు..హిట్లర్ ఇద్దరు ఒక్కటే
ఒకే తారీఖున పుట్టిన వారు ఒకే విధంగా వ్యవహరిస్తారని బొత్స సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేశారు. హిట్లర్, చంద్రబాబు ఒకే తారీఖున పుట్టారని, ఆయన మాదిరిగానే చంద్రబాబు కూడా నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌పై చేస్తున్న ఈ గ్లోబల్ ప్రచారాన్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదని, ఒక సంక్షేమ ప్రభుత్వం రావాలని కోరుతున్నారని తెలిపారు. ఆ నాయకత్వం రావాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. 2004 నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి వైఎస్‌ఆర్ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఆరు సంవత్సరాల్లోనే సంక్షేమ రాజ్యంగా పేరు తెచ్చుకున్నారని చెప్పారు. ఇది వైఎస్‌ఆర్ ప్రభుత్వం అన్ని గుర్తింపు ఉందన్నారు. గత 9 ఏళ్ల చంద్రబాబు పాలనలో కానీ, ఈ నాలుగేళ్లలో కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా చెప్పుకునే విధంగా లేదన్నారు. ఈ కార్యక్రమాన్ని మేం గొప్పగా చేశామని చెప్పుకునే సత్తా టీడీపీకి ఉందా అని నిలదీశారు. ఆ రోజు పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు ఈ ప్రభుత్వం పేర్లు మాత్రమే మార్చారని, ఆ పథకాలను తొలగించే వీలు లేకుండా పోయిందన్నారు.
ప్రజాసంకల్పయాత్రకు బ్రహ్మరథం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బొత్స సత్యనారాయణ తెలిపారు. గత 40 రోజులుగా వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలు ప్రతిపక్ష నేతకు తమ ఇబ్బందులు చెబుతున్నారని చెప్పారు. ఇదే వరవడితో, దృక్ఫథంతో వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నారని, రాజన్న రాజ్యం తెచ్చేందుకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చేలా ఇతరులు ప్రయత్నించినా వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్నారని చెప్పారు. గత నాలుగేళ్లుగా టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తున్నామని చెప్పారు. అభివృద్ధికి ఏ కార్యక్రమం చేపట్టినా మా వంతు సహకారం అందిస్తామని చెప్పారు.
రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధి ధ్యేయమే ప్రధానంగా ముందుకు రావాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిని పక్కన పెట్టి వాస్తవాలు ప్రజలకు చెప్పాలన్నారు. జాతీయ ప్రాజెక్టును కేంద్రం నుంచి రాష్ట్రం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. హోదా ముగిసిన అధ్యాయం కాదు, ఐదు కోట్ల ప్రజలకు సంజీవని అని చెప్పారు. జరుగుతున్న ప్రజా సంకల్ప యాత్రకు యువ నాయకుడు వైఎస్ జగన్‌కు మీ ఆశీస్సులు ఇవ్వాలని బొత్స సత్యనారాయణ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment