పార్లమెంటులో ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిని సజీవంగా తగలపెట్టేందుకు ప్రయత్నించిన ఘటనపై శుక్రవారం లోక్‌సభ అట్టుడికింది. చర్చ సందర్భంగా పలువురు సభ్యులు హైదరాబాద్‌లో దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ను కూడా ప్రస్తావించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రసంగిస్తున్న సమయంలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు.. ఆమెను బెదిరిస్తున్న తీరులో వ్యవహరించడంపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు. జీరో అవర్‌లో ఉన్నావ్ ఘటనను లేవనెత్తిన కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి చేసిన ఒక వ్యాఖ్య బీజేపీ సభ్యులకు ఆగ్రహం తెప్పించింది.
‘ఒకవైపు రామ మందిర నిర్మాణ ఏర్పాట్లు జరుగుతుంటే.. మరోవైపు సీతమ్మలను తగలబెడ్తున్నారు’ అని చౌధురి వ్యాఖ్యానించారు. ఉత్తర పదేశ్ చట్టాలు అమలుకాని అధర్మ ప్రదేశ్‌గా మారిందన్నారు. దీనిపై హోం మంత్రి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్, ఉన్నావ్ ఘటనలను పోలుస్తూ.. ‘నిందితులను హైదరాబాద్ పోలీసులు కాల్చిపారేశారు.. ఉత్తరప్రదేశ్ పోలీసులు వదిలేశారు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ ఉన్నావ్ ఘటనకు మతం రంగు పులముతున్నారని, రాజకీయం చేస్తున్నారని విపక్షాలపై విమర్శలు గుప్పించారు.
చదవండి: ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి
కాంగ్రెస్ సభ్యుల అనుచిత ప్రవర్తన
ఇరానీ ఆవేశంగా మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ సభ్యులు టీఎన్ ప్రతాపన్, దీన్ కురియకొసె గట్టిగా అరుస్తూ, ఆగ్రహంగా ఇరానీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రతీపన్ బెదిరింపు ధోరణిలో షర్ట్ చేతులను పైకి లాక్కోవడం కనిపించింది. దీనిపై ఇరానీ, బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లంచ్ బ్రేక్ తరువాత ఆ ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సభలోకి రాలేదు.
వెంటిలేటర్‌పై ఉన్నావ్ బాధితురాలు మృతి
ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ గతరాత్రి మృతి చెందింది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలికి వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. 90 శాతం కాలిన గాయాలతో రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. గతేడాది డిసెంబర్‌లో మృతురాలిపై అత్యాచారం జరుగగా, విచారణ నేపథ్యంలో గురువారం కోర్టుకు వస్తున్న బాధితురాలిపై ఐదుగురు దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు.
Comments
Please login to add a commentAdd a comment