
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన సభాధిపతి ఎస్.మధుసూదనాచారి తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బహి రంగ ఆక్షేపణలు చేస్తోంది. సోమ, మంగళవారాల్లో అసెంబ్లీలో జరిగిన ఘటనల నేపథ్యంలో స్పీకర్ బాధ్యతలో ఉన్న వ్యక్తి నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత లు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే తమను ఉద్దేశిస్తూ స్పీకర్ ‘దుర్మార్గం’అనే పదాన్ని ఉపయోగించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాకు హక్కులే లేవా..?
గవర్నర్ ప్రసంగం సందర్భంగా తమ సభ్యుల వ్యవహారశైలిపై అధికార పక్షం స్పందించిన తీరును అమలు చేసే విషయంలో స్పీకర్ మధుసూదనాచారి తమ హక్కులను కాపాడలేదని కాంగ్రెస్ వాదిస్తోంది. దీనిపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. సభలోకి వస్తూనే కాంగ్రెస్ సభ్యులు దుర్మారంగా వ్యవహరించారనడంలో స్పీకర్ ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
సభ్యులందరూ స్పీకర్‌కు ఒకటేనన్న విషయాన్ని విస్మరించారన్నారు. ‘సస్పెన్షన్ ప్రతిపాదనలో నా పేరు చదివినప్పుడు ఎందుకు సస్పెండ్ చేశారని స్పీకర్‌ను అడిగా. కనీసం నా అరుపులను పట్టించుకోలేదు. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న నన్ను పట్టించుకోలేదు. మేం వెళ్లిపోయిన తర్వాత సీఎం చేత మమ్మల్ని తిట్టించి మరోసారి అవమానపరిచారు. స్పీకర్‌గా ఇది మీకు తగునా?’ అని ప్రశ్నించారు.
జరిగిందేంటో ప్రజలకు చూపండి
అసలేం జరిగిందో ప్రజలకు, సభకు వీడియో లు చూపించాలని అడిగినా చూపించలేదని ఉత్తమ్ ఆరోపించారు. కనీస విచారణ జరపకుండా తమను సభ నుంచి గెంటివేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వారిపై అనర్హత వేటు వేయాలని తామిచ్చిన పిటిషన్లను నాలుగేళ్లుగా పెండింగ్‌లో పెట్టుకున్న స్పీక ర్.. సోమవారం ఘటన జరగ్గానే మంగళవా రం చర్యలకు ఎలా ఉపక్రమించారని ప్రశ్నించా రు. స్పీకర్‌కు లేని అధికారాలను ఆయన సంక్రమింపజేసుకుంటున్నారని, హరీశ్ మూవ్ చేస్తే స్పీకర్ పాస్ చేసేలా వ్యవహరిస్తూ ఆ పదవిని అప్రతిష్టపాలు చేస్తున్నారని మండిపడ్డారు.