ప్రశ్నిస్తే తిడతారా? | Vijayashanthi Slams On KCR Mahabubnagar | Sakshi
Sakshi News home page

ప్రశ్నిస్తే తిడతారా?

Published Thu, Oct 11 2018 8:41 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

Vijayashanthi Slams On KCR Mahabubnagar - Sakshi

రోడ్డు షోకు హాజరైన ప్రజలు, కాంగ్రెస్‌ శ్రేణులు, కొత్తకోట రోడ్డు షోలో మాట్లాడుతున్న విజయశాంతి, పక్కన భట్టి విక్రమార్క, డీకే అరుణ

ఎన్నికలను పురస్కరించుకుని కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన రోడ్‌ షో ఉత్సాహంగా సాగింది. సీఎం కేసీఆర్‌ ఇటీవల తమపై చేసిన విమర్శలకు దీటుగా కాంగ్రెస్‌ నేతలు స్పందించారు. అభివృద్ధిని ప్రశ్నిస్తే బూతులు తిడతారా? అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ కాదు అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శలు సంధించారు.

సాక్షి, వనపర్తి : ఖర్చుచేసిన నిధులు, చేపట్టిన అభివృద్ధి గురిం చి ప్రశ్నిస్తే కేసీఆర్, అతని కుటుంబ సభ్యులు తిట్ల దండకం అందుకుంటున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సీఎం స్థాయి వ్యక్తి తూ నీ బతుకు చెడా అని అంటుంటే, ఆయన కుమారుడు కేటీఆర్‌ తెలంగాణ ఇచ్చి న సోనియాగాంధీని అమ్మా నా బొమ్మ అని అంటుం టే చూస్తూ ఉపేక్షిద్దామా? అని కార్యకర్తలను కోరారు. బుధవారం దేవరకద్ర అసెం బ్లీ నియోజకవర్గం కొత్తకోట నుంచి కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారపర్వాన్ని ప్రారంభించారు. పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి, మాజీ మంత్రి డీకే అరుణతో కలిసి కొత్తకోట నుంచి ఆత్మకూర్‌ మీదుగా అమరచింత, మక్తల్, నారా యణపేటల్లో రోడ్డు షోలు, సభ లు నిర్వహించారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పాలనలో మొదటి ఏడాది రూ.1.05కోట్లు, రెండో ఏడాది రూ.1.50 కోట్లు, మూడో ఏడాది రూ.1.75కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని, దీనికితోడు మరో రూ.లక్ష కోట్ల అప్పు ప్రజల నెత్తినమోపారని ధ్వజమెత్తారు. ఇంత ఖర్చుచేసినా తెలంగాణలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని, ఈ సంపద ఎటు పోయిందో లెక్కలు చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ నిలదీస్తే తప్పించుకు తిరుగుతూ బూతులు తిడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ నాయకుల కళ్లను అభివృద్ధి కనిపించడం లేదని సీఎం కేసీఆర్‌ అంటున్నారని, నాగార్జునసాగర్, శ్రీశైలం, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులను నీవు కడితే తమ కళ్లకు కనిపించడం లేదా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటంటే ఖాళీగా ఉన్న పైపులు, నీళ్లు తోడని పంపులు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

హామీలు అమలుచేస్తాం 
నాడు పాదయాత్ర సందర్భంగా దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని, ఉచిత కరెంట్‌ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే నిలబెట్టుకున్నామని గుర్తుచేశారు. ఈ సారి కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి ఆరు గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా, నిరుద్యోగులకు రూ.3వేల భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేస్తారని ఓట్లు వేస్తే రూ.800 కోట్ల కాంట్రాక్టులు తీసుకుని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కాంట్రాక్టర్‌ అవతారం ఎత్తారని ఎద్దేవా చేశారు. అక్కడ దోచుకున్న డబ్బుతో ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు వస్తారని, ప్రజలు అప్రమత్తంగా ఉండి దొరల ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రజల ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
  
రూ.కోట్లు కూటబెట్టుకున్నారు: విజయశాంతి 
టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో శూన్యమని, ప్రజలను దోచుకోవడంలో మిన్న అని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార కమిటీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి విమర్శించారు. రాష్ట్రా న్ని అప్పులకుప్పగా మార్చారని, రూ.30వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, సొమ్ము ఆ నలుగురి వద్దే ఉందని ఆరోపించారు. బడుగు బలహీనవర్గాల కోసం కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తే ప్రజలను దోచి సీఎం కేసీఆర్‌ రూ.వేల కోట్లు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. దోచుకున్న డబ్బుతో ఓట్లను కొనడానికి వస్తారని, వారు ఇచ్చింది తీసుకుని కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ను నమ్మి ఒకసారి ఓటు వేస్తే ప్రజలను బకరా చేశారని, ఈ సారి కేసీఆర్‌ను బకరా చేయాలని సూచించారు. కేంద్రంలో బీ జేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ కుమ్మకయ్యాయ ని, అం దువల్లే తెలంగాణలో 20 లక్షల ఓట్లు గల్లంతైనా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. డబుల్‌ బెడ్‌రూం వచ్చాయా? దళితులకు మూడెకరాల భూమి వచ్చిందా? కార్యకర్తలను ఆమె అడిగారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి తూట్లు పొడిచారని విమర్శించారు.
 
ప్రాజెక్టులను అడ్డుకుంటున్నామనడం సిగ్గుచేటు: డీకే
మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లా కరువు కాటకాలు, వలసలతో అల్లాడిపోతుంటే నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులను చేపట్టిందని తెలిపారు. 2014కు ముందే 95 శాతం పనులు పూర్తిచేశామని, నాలుగేళ్ల పాలనలో కొన్నింటిని పూర్తిచేసి తామే చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవాచేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్‌ వట్టెం సభలో ప్రాజెక్టుల వద్దే కుర్చి వేసుకుని కూర్చుని పనులు చేయిస్తా నని అన్నారని, ఎందుకు పూర్తికాలేదని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నా రని అనడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్‌ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, మరోసారి అతని మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు. మక్తల్‌ నియోజకవర్గాన్ని అన్నివిధాలు గా విస్మరించిన చిట్టెం రాంమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థిని గెలిపించాలని డీకే కోరారు.

కాంగ్రెస్‌ హయాంలోనే అభివృద్ధి : డోకూరు 
దేవరకద్ర నియోజకవర్గంలో అభివృద్ధి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని పార్టీ సమన్వయ కర్త డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లాలో నాలుగు రిజర్వాయర్లు ఉన్నా సాగునీరు అందడం లేదని రూ.200 –300కోట్లు ఖర్చుచేసి పనులు చేపడితే వేల ఎకరాల భూములు సాగులోకి వచ్చే అవకాశం ఉన్నా  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 

పాలన చేతకాక రద్దుచేశారు: జీఎంఆర్‌  

నేడు పాలమూరు, కందనూలులో రోడ్‌షో  స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: కాంగ్రెస్‌ పార్టీ చేప ట్టిన రెండో ప్రచారం ఎన్నికల ప్రచారం గు రువారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో సాగనుంది. ఈ మేరకు గురువారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీ రోడ్‌షో ఉదయం 11 గంటలకు పాలమూరు యూనివర్సిటీ నుంచి వన్‌టౌన్, అశోక్‌టాకీస్‌ చౌరస్తా మీదుగా క్లాక్‌టవర్‌ వరకు సాగుతుందని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత క్లాక్‌టవర్‌లో బహిరంగ సభ ఏర్పాటుచేశామన్నారు. ఈ సభలో స్టార్‌ కాంపెయినర్‌ విజయశాంతి, ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి డీకే.అరుణ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్‌ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు.

అనంతరం క్లాక్‌టవర్‌ నుంచి ఏనుగొండ వరకు రోడ్‌షో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే, నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ రోడ్డు షో గురువారం సాగుతుందని ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి మరో ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5గంటలకు ప్రారంభమ య్యే ఈ ప్రచారంలో స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి. ప్రచార కమిటీ చైర్మన్‌ భట్టి విక్రమార్క హాజరుకానున్నారపని పేర్కొన్నారు. సాయంత్రం తిమ్మాజిపేట, బిజినపల్లి మండలాల మీదుగా నాగర్‌కర్నూల్‌కు రోడ్డు షో చేరుకుంటుందని తెలిపారు. పట్టణ ప్రధాన చౌరస్తాలో ప్రసంగించిన అనంతరం నాయకులు కొల్లాపూర్‌ వెళ్లనున్నారని వివరించారు.  

హెలీప్యాడ్‌ వద్ద ఉద్రిక్తత 

సాక్షి, వనపర్తి: పోలీసులు సరైన భద్రతాచర్యలు తీసుకోకపోవడంతో కాంగ్రెస్‌ నాయకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్తకోటలో జరిగిన రోడ్‌ షోలో పాల్గొనేందుకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క, స్టార్‌ క్యాంపెయినర్, సినీనటి విజయశాంతి హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో బుధవారం మధ్యాహ్నం కొత్తకోట చేరుకున్నారు. అప్పటికే సిద్ధంచేసిన హెలిప్యాడ్‌ చుట్టూ సుమారు 2వేల మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులు చేరు కున్నారు.

హెలిక్యాప్టర్‌ ఆగడంతోనే వారంతా దూసుకొచ్చారు. రక్షణ కంచె పూర్తిగా విరిగిపోయింది. ఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సినీనటి వస్తున్నా రని తెలిసినా హెలిప్యాడ్‌ వద్ద ఇద్దరు ఎస్‌ఐలు, 18 మంది కానిస్టేబుళ్లను మాత్రమే నియమించారు. హెలిక్యాప్టర్‌ దిగకముందే ప్రజలను దూ రంగా ఉంచాల్సిన పోలీసులు పట్టించుకోకపోవడం, రక్షణ కంచె పటిష్టంగా లేకపోవడం, బందోబస్తు తక్కువగా ఉండటంతో జనం దూసుకొచ్చారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు వారిని వాహనంలోకి ఎక్కించారు. అధికార పార్టీ నాయకులకు రాచమర్యాదలు చేసే పోలీసు లు తమను చిన్నచూపు చూస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు.  

మహిళల నిరసన 

బతుకమ్మ సందర్భంగా ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ చేయాల్సి ఉండగా.. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ మహిళా సంఘాల బాధ్యులు నారాయణపేటలో నిరసన తెలిపారు. మూడు రోజుల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ నాయకులు నారాయణపేటలో బుధవారం రాత్రి రోడ్డు షో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రచార కమిటీ కోచైర్మన్‌ డీకే అరుణ, కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతికి వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేశారు. వారు ప్లకార్డులు ప్రదర్శించగా.. పోలీసులు సర్దిచెప్పి వెనక్కి పంపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

మక్తల్‌లో జరిగిన సభలో అభివాదం చేస్తున్న  విజయశాంతి, పక్కన భట్టి విక్రమార్క, డీకే.అరుణ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement