నాయకులను నిలదీస్తున్న స్థానిక మహిళ
తిరుమల : తిరుమలలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ నాయకులకు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. ఓట్ల కోసం వచ్చేవారు ఎన్నికల అయ్యాక తిరుమల ముఖం కూడా చూడారని నిలదీయడంతో టీడీపీ నేతలు కంగుతిన్నారు. తొలుత ప్రచారానికి బయల్దేరే ముందు స్థానిక వినాయకస్వామి ఆలయ దర్శనార్థం వెళ్లగా అక్కడ కొందరు మహిళలు వారిని సమస్యలపై నిలదీశారు. తిరుమలలో స్థానిక సమస్యలు తీర్చకుండా ఓట్లు అడగడానికి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని మండిపడ్డారు.
తమకు న్యాయం చేయని పార్టీకి ఓట్లు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు. పేదవాళ్లకు ఎలాంటి న్యాయం జరగడం లేదని నిరసించారు. తిరుమలలో నివసిస్తున్న తమకు ఎలాంటి బతుకుదెరువు లేదని, టీటీడీలో కూడా ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని వాపోయారు. టీడీపీ నాయకుల తీరు వల్ల తమ పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారిందని నిప్పులు చెరిగారు. ఒకరి సంపాదనపైనే 10 మంది కుటుంబ సభ్యులు ఆధారపడాల్సి వస్తోందని, తమకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందడం లేదని, పక్కా గృహాలు మంజూరు చేయలేదని నిప్పులు చెరిగారు. చిన్నపాటి వ్యాపారం చేసుకుందామని వెళ్లినా కేసులు పెడుతున్నారని వారిని చడామడా దులిపేశారు. దీంతో తెలుగుతమ్ముళ్లు భంగపాటుకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment