స్మార్ట్‌ సిటీ కాదు కనీసం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ లేదు! | YS Jagan Mohan Reddy Fires on CM Chandrababu in Kakinada | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ సిటీ కాదు కనీసం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ లేదు!

Published Mon, Apr 8 2019 4:59 PM | Last Updated on Mon, Apr 8 2019 7:48 PM

YS Jagan Mohan Reddy Fires on CM Chandrababu in Kakinada - Sakshi

సాక్షి, కాకినాడ: ‘ఇదే కాకినాడ నియోజకవర్గం గుండా నా మూడు వేల ఆరు వందల 48 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. ఇదే కాకినాడను చంద్రబాబు స్మార్ట్‌ సిటీ చేస్తానన్నారు. స్మార్ట్‌ సిటీ సంగతి దేవుడెరుగు కనీసం ఇక్కడ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కూడా నిర్మించలేదు. ఇదే తూర్పు గోదావరి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని మాటలు చెప్పారు. 19 నియోజకవర్గాలున్న ఈ జిల్లాలో ఏకంగా 14 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రజలు టీడీపీకి కట్టబెట్టారు. ఇవి సరిపోవన్నట్టుగా చంద్రబాబు కుట్ర చేసి.. ప్రలోభాలు పెట్టి.. సంతలో పశువులను కొన్నట్టుగా  మరో ముగ్గురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. మొత్తం 19 మంది ఎమ్మెల్యేలలో 17 మందిని సంకలో పెట్టుకొని ఈ జిల్లాకు చంద్రబాబు చేసిందేమిటి? ఇక్కడ లార్జ్‌ పరిశ్రమ సంగతి దేవుడెరుగు.. కనీసం చిన్నస్థాయి పరిశ్రమను కూడా ఆయన తీసుకురాలేదు’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఇంద్రపాలెంలో జరిగిన ప్రచార సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. 

కన్నబాబు.. యువకుడు, ఉత్సాహవంతుడు
కాకినాడ రూరల్‌ పార్టీ అభ్యర్థి కన్నబాబును సభకు వైఎస్‌ జగన్‌ పరిచయం చేస్తూ.. ‘ కన్నబాబు.. మీ అందరికీ పరిచయస్తుడే. ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంచి పనులు చేశారు. మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. అన్ని రకాలుగా మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కన్నబాబు మీద ఉంచాలని సవినయంగా ప్రజలను కోరుతున్నాను’ అని అన్నారు. 

‘ఇప్పుడు కాకినాడలో ఎక్కడ చూసినా.. అన్నా ఉద్యోగాల్లేవు.. జాబుల్లేవు.. అన్నా ఇబ్బందిగా ఉంది .. అన్న మాటలే దారి పొడవునా వినిపిస్తున్నాయి. చంద్రబాబు సర్కారు వల్ల ఈ ఐదేళ్లలో మన పిల్లలకు ఏదైనా  మంచి జరిగిందా? మన కుటుంబాలకు ఏమైనా మేలు జరిగిందా? ఆ రోజు ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు.. జాబు రావాలంటే బాబు రావాలని అన్నాడు. జాబు ఇవ్వకపోతే రెండువేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. కానీ, ఈ ఐదేళ్లలో ఆ రెండు ఇవ్వలేదు. ఈ లెక్కన ఐదు సంవత్సరాల కాలానికి ప్రతి ఇంటికీ చంద్రబాబు లక్ష 20 వేల రూపాయలు బాకీ పడ్డాడు’ అని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.

‘రాష్ట్రం విభజన సమయంలో ఏపీకి సంబంధించి లక్ష 42వేలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఐదేళ్ల కాలంలో రిటైర్మెంట్లు తదితర కారణాలతో అక్షరాల మరో 90వేల ఉద్యోగాలు ఖాళీ అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయినా చంద్రబాబు నాయుడు ఒక్క ఉద్యోగం కూడా రాష్ట్రంలోని యువతకు ఇవ్వలేదు. బాబు ఉద్యోగాలు ఇస్తాడేమోనని చదువుకున్న పిల్లలు వేలకు వేలు కోచింగ్‌ సెంటర్లకు పోసి చదువుతూనే ఉన్నారు. చంద్రబాబు ఈ ఐదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఇప్పటికీ వారు చదువుతూనే ఉంటూ.. జాబుల కోసం ఎదురుచూస్తున్నారు’ అని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

‘మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉద్యోగాలు వచ్చేవి. ప్రతి జిల్లా ఒక హైదరాబాద్‌ అయి ఉండేది. హోదా వస్తే ఇన్‌కం ట్యాక్స్‌ కట్టాల్సిన పనిలేదు. జీఎస్టీ కట్టాల్సిన పనిలేదు. హోదాతో రాష్ట్రంలో పరిశ్రమలు, ఆస్పత్రులు, హోటళ్లు, ఐటీ కంపెనీలు వస్తాయని తెలిసి కూడా.. నాలుగేళ్లు కేంద్రంలో బీజేపీతో టీడీపీ సంసారం చేసింది. చిలుక-గోరింకలు సైతం సిగ్గుపడేలా కేంద్రంలో బీజేపీతో కాపురం చేసిన చంద్రబాబు.. ఈ నాలుగేళ్లలో హోదా కోసం ఏనాడూ డిమాండ్‌ చేయలేదు. కేంద్రంలోని టీడీపీ మంత్రులు కూడా హోదా గురించి కేంద్రాన్ని నిలదీయలేదు. నాలుగేళ్లు దగ్గరుండి చంద్రబాబు హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారు. హోదా రాకపోవడం, ఉద్యోగాలు లేకపోవడం, చంద్రబాబు పట్టించుకోకపోవడంతో ఈ ఐదేళ్లలో నిరుద్యోగుల సంఖ్య రెట్టింపైంది’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు. 

ఒకేసారి 2.30 లక్షల ఉద్యోగాల రిలీజ్‌..!
ఉద్యోగాలకు సంబంధించి ‘మీ అందరి సమస్య నేను విన్నాను.. మీ అందరికీ నేను ఉన్నాను’ అంటూ భరోసా ఇచ్చిన వైఎస్‌ జగన్‌.. మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఒకేసారి రిలీజ్‌ చేస్తానని రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భారీ హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం జనవరి 1 వచ్చేసరికి క్రమం తప్పకుండా ఉద్యోగాల క్యాలండర్‌ విడుదల చేస్తానని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఏర్పాటు చేసి.. గ్రామంలోని చదువుకున్న యువత పదిమందికి ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ‘మన గ్రామాల్లో, వార్డుల్లో పింఛన్ కావాలన్నా‌, రేషన్ కావాలన్నా‌, ఇళ్లు కావాలన్నా.. మరుగుదొడ్లు కావాలన్నా.. చివరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. ఆరోగ్య శ్రీ కావాలన్నా లంచం ఇవ్వాల్సిన నేడు నెలకొంది.

ఈ పరిస్థితిని పూర్తి మార్చేస్తాం. ప్రతి గ్రామంలో పదిమంది యువతకు ఉద్యోగాలు ఇచ్చి.. ప్రభుత్వ సేవలు, పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే.. ఏ లంచం లేకుండా, ఎవరి చుట్టూ తిరగకుండా.. వాటిని అందిస్తాం’  అని తెలిపారు. ‘గ్రామ సచివాలయానికి అనుసంధానంగా గ్రామ వాలంటీర్లను నియమిస్తాం. వార్డులోని ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి నెలకు రూ. ఐదువేల గౌరవ వేతనం ఇస్తాం. చదువుకున్న యువత సేవా దృక్పథంతో వేరే ఉన్నతమైన ఉద్యోగం దొరికేవరకు ఈ పని చేస్తారు. వారి ద్వారా వార్డులోని ప్రతి 50 ఇళ్లకు సంబంధించి ప్రభుత్వ పథకాలను నేరుగా ఇళ్లకు వచ్చి డోర్‌ డెలివరీ చేస్తాం. గ్రామ వాలంటీర్ల ద్వారా కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికీ తలుపు తట్టి మీ ఇంటికి వచ్చి నేరుగా ప్రభుత్వ పథకాలు అందిస్తాం’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు. 

లాభదాయకమైన ప్రభుత్వ కాంట్రాక్టులన్నింటినీ నిరుద్యోగ యువతకే ఇవ్వాలని అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొస్తామని, ఇందులోనూ 50శాతం రిజర్వేషన్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. ప్రతి పరిశ్రమలోనూ 75శాతం ఉద్యోగాలు స్థానికులకే అందించేలా చర్యలు తీసుకుంటామని, అంతేకాకుండా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం అందించేవిధంగా యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ద్వారా శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు.


25కు 25 ఎంపీ స్థానాలు గెలిస్తే..!
రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి.. వైఎస్సార్‌సీపీ 25కు 25 లోక్‌సభ స్థానాలు గెలుపొందితే.. అటు తెలంగాణలోనూ 17మంది ఎంపీలు మనకు అండగా నిలబడితే.. మొత్తం 42మంది ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి హోదా ఇవ్వాలని నినాదం అందుకుంటారని,  అప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా దిగివచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందని వైఎస్‌ జగన్‌ తెలిపారు. కేంద్రంలో ఏ ఒక్క పార్టీకి సొంతంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదని, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తెలుగు రాష్ట్రాల్లోని 42 మంది ఎంపీలు అప్పుడు అత్యంత కీలకం అవుతారని, అలాంటి సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఫైల్‌పై సంతకం చేస్తేనే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తామని చెప్పి.. హోదాను సాధించుకుంటామని వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు వస్తాయని, దీంతో స్థానికంగానే మన పిల్లలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. 

చంద్రబాబు కుట్రలు..
చంద్రబాబునాయుడు రోజుకొక కుట్ర చేస్తున్నారని, ఆయన అనుకూల టీవీలు, పేపర్లలో రోజుకొక కుట్ర చేస్తూ.. ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా చూపిస్తూ.. పుకార్ల సృష్టించి చర్చ జరుపుతున్నారని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. టీవీ చానెళ్లు, న్యూస్‌ పేపర్లు వాస్తవానికి చంద్రబాబునాయుడు ఐదేళ్ల పాలన మీద చర్చ జరగకుండా చూస్తున్నారని, ఆయన పాలన మీద చర్చ జరిగితే.. బాబు చేసిన మోసాలకు డిపాజిట్లు కూడా రావనే భయంతో ఆ చర్చ జరగకుండా కుట్ర చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధమని, ఈ యుద్ధం కేవలం చంద్రబాబుతో మాత్రమే కాదు.. ఈనాడుతో, ఆంధ్రజ్యోతి, టీవీ 5తోపాటు ఇంకా అమ్ముడుపోయిన అనేక టీవీ చానెళ్లతో మనం యుద్ధం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పోలింగ్‌ సమీపించడంతో చంద్రబాబు ప్రతివాడకూ మూటలు మూటలు డబ్బు పంపిస్తాడని, ప్రతి వ్యక్తి చేతిలోనూ మూడు వేల డబ్బు పెట్టి.. ప్రతి ఒక్కరినీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తాడని, చంద్రబాబు మోసాలకు మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పసుపు-కుంకుమ మోసాలకు, ఇతర ప్రలోభాలకు మోసపోకూడదని, జగన్‌ అన్న ముఖ్యమంత్రి అయితే.. నవరత్నాలతో ప్రతి ఇంటికి మేలు చేస్తాడని.. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు చెప్పాలని వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులు, అభిమానులకు పిలుపునిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement