‘మహానాయకుడే చూడాలంటా.. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను చూడొద్దంటా’ | Ys Jagan Mohan Reddy Speech At Puttur Public Meeting | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు వస్తే మన భూములు, ఇళ్లు ఉండవు’

Published Fri, Mar 29 2019 6:54 PM | Last Updated on Fri, Mar 29 2019 8:58 PM

Ys Jagan Mohan Reddy Speech At Puttur Public Meeting - Sakshi

సాక్షి, పుత్తూరు(చిత్తూరు జిల్లా) : ‘సీఎం చం‍ద్రబాబు నాయుడుకు సంబంధించిన మహానాయకుడే చూడాలంటా.. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చూడకూడదంటూ ‍ప్రచారం చేస్తున్నారు. ఆ సినిమాను ఆపాలని కోర్టులకు వెళుతున్నారు. మరోసారి బాబు అధికారంలోకి వస్తే వాళ్లకు నచ్చిన సినిమాలనే చూడాలి. ఆయనను వ్యతిరేకించిన వారిని బతకనివ్వరు. చం‍ద్రబాబు వస్తే మన భూములు, ఇళ్లు ఉండవు’అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.

గత ఎన్నికల్లో చంద్రబాబు చేసిన వాగ్ధానాలు గుర్తు తెచ్చుకోమని, మరోసారి అలాంటి అబద్దపు హామీలకు మోసపోవద్దని కోరారు. ప్రసుతం చంద్రబాబు ఇస్తున్న హామీలు, ప్రకటనలు చూసి నమ్మితే నరమాంసాన్ని తినే అందమైన రాక్షసిని నమ్మినట్టే అని విమర్శించారు.  అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్కే రోజా, చిత్తూరు లోక్‌సభ అభ్యర్థి రెడ్డప్పలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే..

హెరిటేజ్‌ కోసం చిత్తూరు డైయిరీని మూయించారు
‘చంద్రబాబు సీఎం అయ్యాక రేణిగుంట చక్కెర ఫ్యాక్టరీ మూతపడింది. సహకార రంగంలో ఉన్న చిత్తూరు, రేణిగుంట చక్కెర ఫ్యాక్టరీలను చం‍ద్రబాబు దగ్గరుండి మూయించారు.  ఈ జిల్లా నుంచి సీఎంగా ఉన్న చంద్రబాబు మామిడి రైతులను పీల్చిపిప్పి చేశారు. చిత్తూరు జిల్లాలో గల్లా ఫుడ్స్‌, శ్రీని ఫుడ్స్‌ రెండూ వాళ్ల పార్టీ నాయకులవే. తోతాపురి మామిడి రైతులకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్నా కనీస గిట్టుబాటు ధర లభించని పరిస్థితి ఉంది. హెరిటేజ్‌ ఫుడ్స్‌, గల్లా ఫుడ్స్‌, శ్రీని ఫుడ్స్‌ కలిసి దళారీ వ్యవస్థను ముందుకు తెచ్చాయి. తోతాపురి మామిడి పంటకు కనీసం రూ.16 వేల గిట్టుబాటు ధర కూడా రాకుండా చేశాయి. పాడి రైతులు కూడా బాబు పాలనలో తీవ్రంగా నష్టపోతున్నారు. లీటర్‌ పాల ధర, వాటర్‌ ధర సమానంగా ఉన్నాయి. చిత్తూరు డెయిరీ నడిస్తే పాడి రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉన్నా బాబు పట్టించుకోవడం లేదు, కేవలం హెరిటేజ్‌ కోసం చిత్తూరు డెయిరీని మూయించారు. గాలేరి-నగరి ప్రాజెక్ట్‌ అంచనాలు పెంచి తన బినామీ సీఎం రమేష్‌కు అప్పగించారు. 

పెన్షన్‌, రేషన్‌ కార్డులు తీసేస్తారు
అసెంబ్లీలో మహిళల సమస్యల గురించి మాట్లాడిన మీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేశారు. చంద్రబాబు పాలన అంతా మోసం, అవినీతి, దుర్మార్గం. టీడీపీ ఈ ఐదేళ్ల పాలనలో ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలను మూయించారు. బాబుకు మరోసారి ఓటేస్తే ఉన్న గవర్నమెంట్‌ స్కూళ్లు కూడా మూతపడి వాటి స్థానంలో ప్రతి గ్రామంలో నారాయణ స్కూల్లు కనపడతాయి. పిల్లలు ఎల్‌కేజీ చదవాలంటే లక్ష రూపాయల ఫీజు కట్టాలి. బాబుకు ఓటేస్తే పొరపాటున బాబుకు ఓటేస్తే కొన ఊపిరితో ఉన్న 108,104 సర్వీసులు పూర్తిగా మూతపడతాయి, పెన్షన్‌, రేషన్‌ కార్డులను తీసేస్తారు, ఫీజు రియింబర్స్‌ మెంట్‌ పథకం కూడా రద్దైపోతుంది, పేదలకు ఇళ్లిచ్చే కార్యక్రమాన్ని పక్కకు పెడతారు. 

అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పండి
ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3వేలకు మోసపోవద్దని చెప్పండి. 15 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తామని తెలపండి. లక్షాధికారులను చేస్తామని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తామని చెప్పండి. అవ్వా,తాతలకు మూడు వేల ఫించన్‌ మీ మనవడు ఇస్తాడని, రైతుల రుణాలు మాఫీ చేస్తాడని రాజన్న రాజ్యాన్ని జగన్‌ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్‌ జగన్‌ కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement