
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం ప్రభుత్వ భూ దోపిడీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజులు వారి స్వప్రయోజనాల కోసమే విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్‌ను రద్దు చేశారని ఆయన మండిపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్ రద్దు వెనుక ఉన్న కుట్రలు, కుతంత్రాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాస్తున్నట్లు ఆయన చెప్పారు.
విజయవాడ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...రాష్ట్ర విభజన సమయంలో విజయనగరం జిల్లా భోగాపురంలో రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు కేబినెట్ సమావేశం పెట్టి భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్‌ను రద్దు చేశారని దీన్ని వైఎస్‌ఆర్ సీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. టెండర్ల రద్దుకు ఇంటిగ్రేటెడ్ ఎయిర్‌పోర్టు అని, భూసేకరణ జరగలేదని చంద్రబాబు కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబులాంటి దుర్భుద్ధి కలిగిన వ్యక్తిని ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా చూడలేదని బొత్స విమర్శించారు. స్థానిక ఎంపీగా ఉన్న అశోక్ గజపతిరాజు కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా.. టీడీపీ తరపున పనిచేస్తున్నాడని ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి హయాంలో ఎంత దోపిడీ జరుగుతుందో భోగాపురం ఎయిర్‌పోర్టు ఒక ఉదాహరణ అని బొత్స అన్నారు. 2013 సంవత్సరంలో భోగాపురంను గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుగా చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు. 2015లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు భోగాపురంకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని అనుమతులు మంజూరు చేసిందన్నారు.
ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జరిగిన టెండర్‌లో అశోక్‌గజపతిరాజు శాఖకు సంబంధించిన ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ, ఒక ప్రైవేట్ సంస్థ పాల్గొన్నాయని బొత్స గుర్తు చేశారు. కాగా టెండర్‌లో ప్రభుత్వరంగ సంస్థ 30.2 శాతం ప్రభుత్వానికి ఆదాయం ఇస్తామని కోడ్ చేసిందని, మరో ప్రైవేట్ సంస్థ 21.6 శాతానికి కోడ్ చేసిందన్నారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు టెండర్ ఇస్తే ఈ నాయకుల దోపిడీకి అవకాశం ఉండదు కాబట్టే టెండర్‌ను రద్దు చేశారన్నారు. దీనికి ఇంటిగ్రేటెడ్ ఎయిర్‌పోర్టు, భూసేకరణ జరగలేదని కుంటిసాకులు చెబుతున్నారని ధ్వజమెత్తారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 10 వేల ఎకరాలు సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధర్నా చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే దిగొచ్చిందన్నారు. 10 వేల ఎకరాలను 5300 ఎకరాలకు తీసుకొచ్చి దాన్ని మళ్లీ 2560 ఎకరాలకు ఫైనల్ చేసిందన్నారు. దాంట్లో 2500ల ఎకరాల భూసేకరణ పూర్తయిందని, మళ్లీ భూసేకరణ జరగలేదని చెప్పడంలో ఆంతర్యం దోపిడీ అని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి మామూళ్లకు లాలూచీ పడ్డారని అర్థం అవుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment