ముసునూరులోని ఇందిరమ్మ కాలనీలో అధ్వానంగా రోడ్లు, నిరుపయోగంగా వాటర్ ట్యాంక్
కావలిఅర్బన్: పట్టణంలోని ముసునూరులో ఇందిరమ్మ పేరుతో కాలనీ ఉంది. గొప్ప నాయకురాలి పేరు మీద ఉన్న ఈ కాలనీ ప్రజలు మాత్రం నిత్యం సమస్యల చుట్టూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు గడచిన ఐదేళ్లుగా కాలనీ అభివృద్ధిపై కనికరం కూడా చూపలేదు. ముసునూరులోని ఇందిరమ్మ కాలనీలో సుమారు 5 వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. కాలనీలో సుమారు 15,00 మంది ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పట్టణంలోని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. అన్ని కాలనీలను శరవేగంగా అభివృద్ధి చేస్తున్న క్రమంలో ఆయన అకాల మరణం చెందారు. ఆ తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం వారిపైన నిర్లక్ష్యం ప్రదర్శించాయి. రూ. కోట్లాది మున్సిపల్ నిధులను అధికారపార్టీ ప్రజాప్రతినిధుల వార్డులలో వెచ్చించుకుంటున్నారు. బాగున్న రోడ్లపైనే రోడ్లు వేసుకుంటూ ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చూపారు.
మౌలిక వసతుల కొరత
కాలనీ ఏర్పడి సుమారు 10 సంవత్సరాలు దాటుతున్నా ఇందిరమ్మ కాలనీ అభివృద్ధిపై శ్రద్ధ చూపడంలేదు. ఇళ్లు కట్టుకుని ఈ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకుని ఇళ్లలోకి కాపురాలు వచ్చారు. కాని ఎటువంటి అభివృద్ధి చేయకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. కొన్ని కుటుంబాలు అక్కడ జీవించలేక తిరిగి కావలికి వెళ్లి బాడుగ ఇళ్లలో నివాసం ఉంటున్నారు. కాలనీలో రోడ్లు నిర్మించాలని స్థానికులు అనేకసార్లు మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్నారు. అదేవిధంగా తాగునీరు కల్పించాలని కోరారు. డ్రైనేజీ, విద్యుత్ సదుపాయం, శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని కోరారు. కాలనీలో ఒక బోరు మాత్రమే పనిచేస్తుంది. దాని నుంచి అనేక కుటుంబాల ప్రజలు నీటిని తెచ్చుకుంటున్నారు. వేసవిలో భూగర్భ జలాలు అడుగంటి ఆ నీరు కూడా రాదని అంటున్నారు. ఓవర్ హెడ్ ట్యాంకుకు దక్షిణ బజారులో ఒక బోరు నిర్మిస్తే ఆ ప్రాంత ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఇంకా అనేక వసతులు కల్పించాలని మొర పెట్టుకున్నా అభివృద్ధి చేయడంలో ముందుకు రాలేదు.
మరమ్మతుకు నోచుకోని బోర్లు
కాలనీలో కొన్ని బోర్లు మరమ్మతులకు గురికాగా మరికొన్ని బోర్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. వాటి చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వలన విషసర్పాలకు ఆవాసాలుగా మారుతున్నాయి. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న కాలనీలో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని అధికారులు తగిన ఏర్పాటు చేయాల్సి ఉంది.
అభివృద్ధి, సంక్షేమ పథకాలు సున్నా
కాలనీలో నివశిస్తున్న నిరుపేద ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు మంజూరు చేయడంలేదు. ఇందిరమ్మ కాలనీలో ఉన్నవారికి వీటిని వర్తింపజేయడంలేదంటూ వాపోతున్నారు. జన్మభూమి కమిటీల సభ్యులు పథకాలు రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న వార్డులలో మాత్రమే అభివృద్ధి పథకాలను అందజేస్తున్నారంటూ వాపోతున్నారు. అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిడులకు తలొగ్గకుండా అర్హులైన పేదలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించాలని కోరారు.
రోడ్లు నిర్మించండి
ఇందిరమ్మ కాలనీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వీధులు గుంతలమయంగా ఉన్నాయి. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు నిర్మించి ఆదుకోండి.
– పోట్లూరు రవి, ఇందిరమ్మ కాలనీ, ముసునూరు, కావలి
దక్షిణ బజారులో బోరు నిర్మించండి
కాలనీలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. ఎండాకాలంలో నీటి ఎద్దడి తలెత్తుతుంది. భూగర్భ జలాలు అడుగంటుతాయి. తాగునీటి సరఫరా అంతంత మాత్రం గానే ఉంటుంది. దక్షిణ బజారులో బోరు నిర్మిస్తే కొంతవరకు తాగునీటి సమస్య తొలగుతుంది.
–ఎస్కే ఖాలీబీ, ఇందిరమ్మ కాలనీ, ముసునూరు, కావలి
Comments
Please login to add a commentAdd a comment