
తమిళసినిమా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీకో విన్నపం అని అన్నది ఎవరో తెలుసా? సంచలన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ సంచలన నటి సమాజంలో జరుగుతున్న సంఘటనలపైనా తనదైన బాణిలో స్పందిస్తున్న విషయం తెలిసిందే. సేవ్‌శక్తి అనే స్వచ్ఛంద సేవా సంస్థను నెలకొల్పి మహిళా రక్షణ కోసం పోరాడుతున్న వరలక్ష్మీశరత్‌కుమార్ ఇటీవల దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆమె ఇక ప్రకటనను విడుదల చేస్తూ జమ్ముకశ్మీర్‌లోని చిన్నారి హత్యాచారం దేశాన్నే కదిలించి వేసిందన్నారు. అలాంటి దారుణాలకు పాల్పడిన వారికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వయసు మళ్లిన వ్యక్తి మనవరాలి వయసున్న యువతిపై అత్యాచారానికి పాల్పడిన దృశ్యాల వీడియో ఒకటి సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో ఆ ముదుసలి వ్యక్తిని ప్రజలు చితకబాదారు.
ఈ వీడియోలోని దృశ్యాలు నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ని మరింత ఆగ్రహానికి గురి చేశాయట. అంతే వెంటనే తన ట్విట్టర్‌లో ప్రధానికో విన్నపం అంటూ మొదలెట్టి, ఇదేనా మనం నివశిస్తున్న ప్రపంచం? ఇలాంటి దేశాన్నే మీరు పరిపాలించాలని కోరుకుంటున్నారా? ప్రధాని మోదీ గారూ మీకు ఓట్లు వేసిన ప్రజల ఆలోచనలను గౌరవించి మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారిని ఉరిశిక్ష విధించే చట్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను అని నటి వరలక్ష్మీశరత్‌కుమార్ ప్రధాని నరేంద్రమోదీకి ట్వీట్ చేశారు. మరి ఈమె ట్వీట్‌కు ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూద్దాం.