
‘చీటర్’ దెబ్బకు ‘కంగారు’!
ఇంగ్లండ్‌లో జరిగిన యాషెస్ సిరీస్‌లో అవుటైనా బయటకు వెళ్లకుండా విమర్శల పాలైన స్టువర్ట్ బ్రాడ్‌ను... స్వదేశంలో జరిగే యాషెస్ సిరీస్‌లో ‘టార్గెట్’ చేసుకోవాలని ఆస్ట్రేలియా ప్రేక్షకులు భావించారు.
బ్రిస్బేన్: ఇంగ్లండ్‌లో జరిగిన యాషెస్ సిరీస్‌లో అవుటైనా బయటకు వెళ్లకుండా విమర్శల పాలైన స్టువర్ట్ బ్రాడ్‌ను... స్వదేశంలో జరిగే యాషెస్ సిరీస్‌లో ‘టార్గెట్’ చేసుకోవాలని ఆస్ట్రేలియా ప్రేక్షకులు భావించారు.
అందుకే యాషెస్ తొలి టెస్టు తొలిరోజున భారీ ఎత్తున బ్రాడ్‌ను తిడుతూ బ్యానర్లు రాసుకుని వచ్చారు. తను మైదానంలో ఎటు కదిలినా ‘చీటర్’ అంటూ గేలి చేశారు. కానీ బ్రాడ్ (5/65) మాత్రం ఇవన్నీ పట్టించుకోలేదు. తనని హేళన చేస్తున్న వాళ్లు మరింత రగిలిపోయేలా... బంతితో నిప్పులు చెరిగాడు. ఫలితంగా యాషెస్‌ను ఇంగ్లండ్ ఘనంగా ప్రారంభించింది. గబ్బాలో గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో 8 వికెట్లకు 273 పరుగులు చేసింది. హాడిన్ (78 బ్యాటింగ్), హారిస్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ రోజెర్స్ (1) విఫలం కాగా, వార్నర్ (49), వాట్సన్ (22), స్మిత్ (31) ఓ మాదిరిగా ఆడారు. వార్నర్, వాట్సన్‌లు రెండో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. క్లార్క్ (1), బెయిలీ (3) నిరాశపర్చారు. ఓ దశలో ఆసీస్ 132 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అయితే హాడిన్, జాన్సన్ ఏడో వికెట్‌కు 114 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. ఈ క్రమంలో కెరీర్‌లో హాడిన్ 13వ, జాన్సన్ 8వ అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నారు. సిడిల్ (7) వెంటనే అవుటైనా.. హారిస్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా రోజును ముగించాడు. అండర్సన్ 2, ట్రెమ్లెట్ ఒక్క వికెట్ తీశారు.