సిడ్నీ: మార్ష్ సోదరులు షాన్, మిచెల్ అద్భుత సెంచరీలు చేయడంతో... యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా విజయం ముంగిట నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌ను 649/7 వద్ద డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియాకు 303 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. ప్రస్తుతం జో రూట్ (42 బ్యాటింగ్), బెయిర్‌స్టో (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ మరో 210 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్ కాపాడుకోవాలంటే ఇంగ్లండ్ చివరి రోజు పూర్తిగా బ్యాటింగ్ చేయాల్సి ఉండగా... ఆసీస్ మరో ఆరు వికెట్లు తీస్తే నాలుగో విజయాన్ని ఖాయం చేసుకుంటుంది.
ఓవర్‌నైట్‌స్కోరు 479/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా ఆటలో మార్ష్ సోదరుల బ్యాటింగే హైలైట్. అన్నదమ్ములిద్దరూ ఒకరిని మించి ఒకరు దూకుడుగా ఆడటంతో.. ఇంగ్లండ్ బౌలర్లు ప్రేక్షక పాత్ర వహించారు. ఈ క్రమంలో ముందు షాన్ మార్ష్ (291 బంతుల్లో 156; 18 ఫోర్లు)... ఆ తర్వాత మిచెల్ మార్ష్ (145 బంతుల్లో 101; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలు పూర్తి చేసుకున్నారు. పాయింట్ దిశగా బంతిని పంపిన మిచెల్ మార్‌ష సెంచరీ సంబరాల్లో పడి రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తొలి పరుగు పూర్తవగానే పిచ్ మధ్యలో సోదరుడిని హత్తుకొని రెండో పరుగు పూర్తి చేయడం మరిచాడు. అనంతరం షాన్ మార్ష్ గుర్తుచేయడంతో క్రీజులోకి చేరి బతికిపోయాడు.
► ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అన్నదమ్ములు సెంచరీలు చేయడం ఇది మూడోసారి. గతంలో చాపెల్ సోదరులు గ్రెగ్, ఇయాన్ (1972లో)... ‘వా’ సోదరులు మార్క్, స్టీవ్ (2001లో)లు కూడా ఇంగ్లండ్ పైనే ఈ ఘనత సాధించడం విశేషం. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్‌లో అన్నదమ్ములిద్దరూ ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేయడం ఇది ఎనిమిదో సారి.
► రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగుల వద్ద కుక్ టెస్టుల్లో 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఆరో బ్యాట్స్‌మన్‌గా కుక్ రికార్డు నమోదు చేశాడు.
► గత 80 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సిడ్నీలో ఆదివారం 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విపరీతమైన ఉక్కపోతతో ఇంగ్లండ్ బౌలర్లు ఉక్కిరిబిక్కిరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment