35 ఏళ్ల తరువాత సెంచరీ
అడిలైడ్:పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజమ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో అజమ్(100)శతకం సాధించాడు. తద్వారా ఐదు వన్డేల సిరీస్ లో ఆస్ట్రేలియాలో ఆ దేశంపై సెంచరీ సాధించిన రెండో పాకిస్తాన్ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. చివరిసారి 1981లో పాకిస్తాన్ ఆటగాడు జహీర్ అబ్బాస్ ఆస్ట్రేలియాలో ఆసీస్ పై తొలిసారి శతకం సాధించాడు. దాదాపు 35 ఏళ్ల తరువాత ఐదు వన్డేల సిరీస్ లో ఒక పాకిస్తాన్ ఆటగాడు ఆస్ట్రేలియాలో ఆసీస్ పై శతకం చేయడం ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు 57 పరుగుల తేడాతో ఓటమి చెందింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 370 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడిన పాకిస్తాన్ 49.1 ఓవర్లలో 312 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. పాక్ ఆటగాళ్లలో బాబర్ అజమ్ సెంచరీకి తోడు, షర్జిల్ ఖాన్(79) హాఫ్ సెంచరీ సాధించాడు. ఆపై ఉమర్ అక్మల్(46) మినహా ఎవరూ రాణంచలేకపోవడంతో పాకిస్తాన్ కు పరాజయం తప్పలేదు. దాంతో ఐదు వన్డేల సిరీస్ను ఆస్ట్రేలియా 4-1తో కైవసం చేసుకుని తమకు తిరుగులేదని నిరూపించింది.