ముంబయి : వెస్టీండీస్ లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారా టీమిండియాను ప్రశంసలతో ముంచెత్తాడు. గతంలో స‍్వదేశంలో మాత్రమే మంచి ప్రదర్శనను కనబరిచిన భారత జట్టు ప్రసుత్తం విదేశాల్లోనూ నిలకడగా రాణిస్తూ అత్యంత శక్తివంతమైన జట్టుగా తయారైందంటూ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ముంబయిలో గురువారం జరిగిన ఓ ఈవెంట్‌కు లారా హాజరయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో భారత జట్టు వరుసగా 11 టెస్టు సిరీస్‌లను గెలవడమే కాకుండా, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా వరుసగా నాలుగు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. అందులో రెండు విజయాలు విండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో వచ్చాయి.
ఈ నేపథ్యంలో లారా స్పందిస్తూ.. 'ఒకప్పుడు టీమిండియా స్వదేశంలో మాత్రమే మంచి ప్రదర్శన ఇస్తూ, విదేశాల్లో మాత్రం చతికిలబడేది. కానీ ప్రస్తుతం విదేశాల్లోనూ అద్బుత విజయాలు నమోదు చేస్తూ అత్యంత శక్తివంతమైన జట్టుగా క్రికెట్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంది . గతంలో విండీస్ 70, 80వ దశకాల్లో, ఆస్ట్రేలియా 90వ దశకం, 20వ శతాబ్దం మొదట్లో క్రికెట్ ప్రపంచాన్నిశాసించాయి. అలాగే ప్రస్తుత క్రికెట్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు మాత్రమే టీమిండియా విజయాలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి. 2016లో టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించిన టీమిండియా అప్పటి నుంచి ఆ స్థానాన్ని కాపాడుకోవడం వెనుక బ్యాటింగ్, బౌలింగ్ వనరుల నైపుణ్యం తెలుస్తుందని' పేర్కొన్నాడు.
విండీస్ తరపున ప్రాతినిధ్యం వహించిన బ్రియాన్ లారా 131 టెస్టుల్లో 11,953 పరుగులు, 299 వన్డేల్లో 10,405 పరుగులు నమోదు చేశాడు. టెస్టుల్లో ఇంగ్లండ్ మీద తాను నమోదు చేసిన 400 పరుగుల రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment