చెన్నై సూపర్ కింగ్స్ చీర్ లీడర్స్ (ఫైల్ ఫొటో)
స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలేవీ వెలుగులోకి రాకుండా ఐపీఎల్-8 సజావుగా సాగుతోందనుకున్న తరుణంలో ఛీర్ గాళ్స్ గదులపై పోలీసుల దాడి సంచలనం రేకెత్తించింది. మంగళవారం రాత్రి రాయ్పూర్లో ఢిల్లీ- చెన్నై జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన కొద్ది గంటలకే నగరంలోని జీఈ రోడ్డు ప్రాంతంలో చెన్నై సూపర్ కింగ్స్ ఛీర్ లీడర్స్ బస చేసిన హోటల్ పై పోలీసులు దాడి చేసి సోదాలు నిర్వహించారు. మూడు వాహనాల్లో హోటల్ కు చేరుకున్న పోలీసులు దాదాపు గంటపాటు ఛీర్ లీడర్స్ పై రకరకాల ప్రశ్నలు సంధించారు.
హోటల్లోని ఇతర గదులకూ వెళ్లిన పోలీసులు.. సంబంధిత వ్యక్తుల వివరాలు సేకరించారు. కొందరు బుకీలు ఛీర్ లీడర్స్ ద్వారా ఆటగాళ్లకు ఎరవేసి ఫిక్సింగ్ కు పాల్పడిన ఉదంతాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఛీర్ లీడర్స్కు, ఆటగాళ్లకు ఐపీఎల్ నిర్వాహకులు వేర్వేరు హోటల్స్లో బస ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం సూపర్ కింగ్స్ ఛీర్ లీడర్స్ గా పనిచేస్తోన్నవారిలో ఎక్కువ మంది ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాలకు చెందినవారే. కాగా సోదాల పేరుతో పోలీసులు తమను వేధించారని చెన్నై జట్టు ఛీర్ లీడర్స్ బోరున విలపించారు. తమకు వర్క పర్కింట్ ఉందని, గతంలో బాలీవుడ్ సినిమాలకు కూడా పని చేశామని అయితే ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదని, అడ్డమైన ప్రశ్నలడిగి పోలీసులు తమను ఇబ్బందిపెట్టారని ఓ ఛీర్ గళ్ కన్నీటి పర్యంతమైంది.
తమపై ఏవైనా ఫిర్యాదులు వస్తే నిర్వాహకులను సంప్రదించాలికానీ ఇలా హోటల్ గదుల్లోకి దూరి భీభత్సం చేయడమేంటని ఛీర్ గాళ్స్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ ఆరోపణలను కొట్టిపారేసిన పోలీసులు.. రొటీన్ చెకప్స్లో భాగంగానే ఛీర్ లీడర్స్ గదుల్ని తనిఖీ చేశామని, ఇందులో మరో ఉద్దేశానికి తావు లేదని, అసాంఘిక విషయాలేవీ తమ దృష్టికి రాలేదని రాయ్ పూర్ సిటీ ఎస్పీ అన్షుమన్ సింగ్ సిసోడియా వివరణ ఇచ్చారు.