డేవిడ్ వార్నర్ అరుదైన ఫీట్
హైదరాబాద్: ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ అరుదైన ఫీట్ ను సొంతం చేసుకున్నాడు. ట్వంటీ 20ల్లో ఏడువేల పరుగుల మార్కను చేరి ఈ ఘనత సాధించిన నాల్గో ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ కెప్టెన్ వార్నర్(76 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించాడు.
తద్వారా ఐపీఎల్లో 33వ అర్ధ శతకాన్ని సాధించడమే కాకుండా, ట్వంటీ 20ల్లో ఏడువేల పరుగులను పూర్తి చేసుకుని ఎలైట్ క్లబ్ లో స్థానం సంపాదించాడు. అంతకుముందు ఈ ఘనత సాధించిన వారిలో క్రిస్ గేల్(వెస్టిండీస్), బ్రెండన్ మెకల్లమ్(న్యూజిలాండ్), బ్రాడ్ హాడ్జ్(ఆస్ట్రేలియా)లు మాత్రమే ఉన్నారు. తాజాగా వారి సరసన వార్నర్ చేరాడు. ఇదిలా ఉంచితే, ఓవరాల్ ఐపీఎల్లో సన్ రైజర్స్ సాధించిన 26 విజయాల్లో వార్నర్ 17 హాఫ్ సెంచరీలు సాధించడం ఇక్కడ మరో విశేషం. శనివారం గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.