ముంబై: సొంతగడ్డపై బౌలర్లు చెలరేగడంతో... ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 66 పరుగుల తేడాతో గెలిచింది. ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్‌కు రెండు పాయింట్లు లభించాయి. ఎడంచేతి వాటం స్పిన్నర్ ఏక్తా బిష్త్ మాయాజాలానికి ఇంగ్లండ్ చేతులెత్తేసింది. 8 ఓవర్లు వేసిన ఏక్తా 25 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకుంది. ఏక్తాకు లభించిన చివరి మూడు వికెట్లు ఐదు బంతుల తేడాలో రావడం విశేషం. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు 49.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ జట్టు 41 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. స్పిన్నర్లు ఏక్తా బిష్త్ (4/25), దీప్తి శర్మ (2/33) భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించారు.అంతకుముందు భారత ఓపెనర్లు జెమీమా రోడ్రిగ్స్ (58 బంతుల్లో 48; 8 ఫోర్లు), స్మృతి మంధాన (42 బంతుల్లో 24; 3 ఫోర్లు) దూకుడుగా ఆడి తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. స్మృతి ఔటయ్యాక భారత ఇన్నింగ్స్ తడబడింది. ఒకదశలో ఒక వికెట్‌కు 85 పరుగులతో పటిష్టంగా కనిపించిన టీమిండియా పది పరుగుల తేడాతో నాలుగు వికెట్లు కోల్పోయి ఐదు వికెట్లకు 95 పరుగులతో నిలిచింది. ఈ దశలో కెప్టెన్ కెప్టెన్ మిథాలీ రాజ్ (74 బంతుల్లో 44; 4 ఫోర్లు), వికెట్ కీపర్ తానియా (41 బంతుల్లో 25; 2 ఫోర్లు) సంయమనంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆరో వికెట్‌కు 54 పరుగులు జత చేశారు.తానియా, మిథాలీ ఔటయ్యాక చివర్లో జులన్ గోస్వామి (37 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో భారత్ స్కోరు 200 పరుగులు దాటింది. ఇంగ్లండ్ బౌలర్లలో జార్జియా అమండా ఎల్విస్, నటాలీ షివెర్, సోఫీ ఎకిల్‌స్టోన్ రెండేసి వికెట్లు తీశారు.
203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభం లభించలేదు. పేసర్ శిఖా పాండే (2/21) ధాటికి ఇంగ్లండ్ 38 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే నటాలీ షివెర్ (44; 5 ఫోర్లు), కెప్టెన్ హీతెర్ నైట్ (39 నాటౌట్; 2 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 73 పరుగులు జోడించి ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. వీరిద్దరు క్రీజులో నిలదొక్కుకోవడంతో ఇంగ్లండ్ లక్ష్యం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. కానీ 31వ ఓవర్లో ఇంగ్లండ్ స్కోరు 111 పరుగుల వద్ద నటాలీ షివెర్‌ను ఏక్తా బిష్త్ రనౌట్ చేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అనంతరం ఏక్తా తన స్పిన్ మాయాజాలంతో విజృంభించింది. తొలుత కేథరీన్ బ్రంట్‌ను ఔట్ చేసిన ఆమె... ఇన్నింగ్స్ 41వ ఓవర్లో ఐదు బంతుల తేడాలో ష్రబ్‌సోల్, సోఫీ ఎకిల్‌స్టోన్, అలెగ్జాండ్రా హార్ట్‌లెలను ‘డకౌట్’ చేసి భారత విజయాన్ని ఖాయం చేసింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ చివరి ఏడు వికెట్లను 25 పరుగుల తేడాలో కోల్పోవడం గమనార్హం.
ఏక్తా మాయాజాలం
Published Sat, Feb 23 2019 12:43 AM | Last Updated on Wed, May 29 2019 2:49 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment