అదిరే...అదిరే... | FIFA World Cup 2014 combined League table with all 32 teams from Group stages | Sakshi
Sakshi News home page

అదిరే...అదిరే...

Published Sat, Jun 28 2014 12:53 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

అదిరే...అదిరే... - Sakshi

అదిరే...అదిరే...

కళ్లు చెదిరే గోల్స్... కనువిప్పు కలిగే ఫలితాలు... స్టార్ ఆటగాళ్ల వైఫల్యం... అగ్రశ్రేణి జట్ల తడబాటు... చిన్న జట్ల చిద్విలాసం... మొత్తానికి ఈసారి ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో లీగ్ దశ అభిమానులకు షడ్రుచుల వినోదాన్ని అందించింది.

 కళ్లు చెదిరే గోల్స్... కనువిప్పు కలిగే ఫలితాలు... స్టార్ ఆటగాళ్ల వైఫల్యం... అగ్రశ్రేణి జట్ల తడబాటు... చిన్న జట్ల చిద్విలాసం... మొత్తానికి ఈసారి ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో లీగ్ దశ అభిమానులకు షడ్రుచుల వినోదాన్ని అందించింది.
 
 
 అత్యధిక గోల్స్ రికార్డు
 ప్రపంచకప్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈసారి లీగ్ దశలో గోల్స్ వర్షం కురిసింది. 48 మ్యాచ్‌ల్లో మొత్తం 136 గోల్స్ వచ్చాయి. దాంతో 130 గోల్స్‌తో ఇప్పటిదాకా 2002 ప్రపంచకప్‌లో నమోదైన రికార్డు తెరమరుగైంది.
 
 ఆసియా జట్లకు నిరాశ
 వరుసగా మూడో ప్రపంచకప్‌లోనూ ఆసియా జట్లకు నిరాశ ఎదురైంది. 2002 ప్రపంచకప్‌లో నాలుగో స్థానం సంపాదించిన దక్షిణ కొరియాతోపాటు జపాన్, ఇరాన్, ఆస్ట్రేలియా జట్లు ఈసారి లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టాయి.
 
 ఆఫ్రికా ఆశాకిరణాలు
 గత వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న ఘనా... దీదీర్ ద్రోగ్బా, శామ్యూల్ ఎటో లాంటి స్టార్ ఆటగాళ్లతో నిండిన ఐవరీకోస్ట్, కామెరూన్ లీగ్ దశలోనే వెనుదిరిగాయి. అయితే అంతగా అంచనాల్లేని అల్జీరియా, నైజీరియా నాకౌట్ దశకు చేరుకొని ఆఫ్రికా ఉనికిని చాటుకున్నాయి.
 
 చిన్న జట్లు... గొప్ప ఫలితాలు
 ఈసారి ప్రపంచకప్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన జట్టు కోస్టారికా. కేవలం 46 లక్షల జనాభా కలిగిన ఈ మధ్య అమెరికా ప్రాంతంలోని దేశం లీగ్ దశలో ‘డబుల్’ వరల్డ్ చాంపియన్ ఉరుగ్వేను... నాలుగుసార్లు విశ్వవిజేత ఇటలీని బోల్తా కొట్టించింది. ప్రపంచ మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని ఔరా అనిపించింది. 4 కోట్ల జనాభా కలిగిన కొలంబియా లీగ్ దశలో అజేయంగా నిలిచి 1990 తర్వాత తొలిసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది.
 
 హ్యాట్రిక్ వీరులు
 రెండు మ్యాచ్‌ల్లో మినహా లీగ్ దశలో అన్ని జట్లు తమ ప్రత్యర్థి జట్లకు గోల్స్ సమర్పించుకున్నాయి. మొత్తం నమోదైన గోల్స్‌లో రెండు ‘హ్యాట్రిక్’లు ఉన్నాయి. పోర్చుగల్‌పై థామస్ ముల్లర్ (జర్మనీ)... హోండురస్‌పై జెర్దాన్ షాకిరి ఒక్కో ‘హ్యాట్రిక్’ చేశారు.
 
 సెల్ఫ్ గోల్‌తో మొదలు...
 ఆశ్చర్యకరంగా ఈసారి ప్రపంచకప్ ‘సెల్ఫ్ గోల్’తో మొదలైంది. క్రొయేషియాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య దేశం బ్రెజిల్ ఆటగాడు మార్సెలో 11వ నిమిషంలో ‘సెల్ఫ్ గోల్’ చేశాడు. మార్సెలోతో పాటు మరో ముగ్గురు ‘సెల్ఫ్ గోల్స్’ చేశారు. అర్జెంటీనాపై కొలాసినిక్ (బోస్నియా అండ్ హెర్జ్‌గోవినా); పోర్చుగల్‌పై జాన్ బోయే (ఘనా); ఫ్రాన్స్‌పై నోయల్ వాలాదారెస్ (హోండురస్) ఒక్కో ‘సెల్ఫ్ గోల్’ చేశారు.
 
  అగ్రశ్రేణి జట్లకు షాక్
 ఘనమైన నేపథ్యం ఉన్నా... ప్రస్తుత ఆటతీరుపైనే భవితవ్యం ఆధారపడి ఉంటుందని అగ్రశ్రేణి జట్లకు ఈ ప్రపంచకప్ ద్వారా అనుభవమైంది. కనీసం నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయనుకున్న డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ స్పెయిన్, నాలుగుసార్లు విజేత ఇటలీ, మాజీ విశ్వవిజేత ఇంగ్లండ్... పోర్చుగల్ జట్లు లీగ్ దశలోనే నిష్ర్కమించాయి.
 
 గీత దాటితే...
 మైదానంలో హద్దుమీరితే ఎంతటి స్టార్ ఆటగాడిపైనైనా వేటు తప్పదని నిరూపితమైంది. ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు డిఫెండర్ జియార్జియో చిలినిని భుజాన్ని కొరికిన ఉరుగ్వే స్టార్ ప్లేయర్ లూయిస్ స్వారెజ్‌పై నాలుగు నెలల నిషేధం... తొమ్మిది మ్యాచ్‌ల వేటు... 65 వేల పౌండ్లు (రూ. 66 లక్షలు) జరిమానా వేశారు. లీగ్ దశలో మొత్తం ఆరుగురు ఆటగాళ్లకు (పెపె-పోర్చుగల్; మర్చిసియో-ఇటలీ; అలెక్స్ సాంగ్-కామెరూన్; వాలెన్సియా-ఈక్వెడార్; స్టీవెన్ డెఫోర్-బెల్జియం; రెబిక్-క్రొయేషియా) వారి దుందుడుకు చర్యలకు తక్షణమే ‘రెడ్ కార్డు’ చూపెట్టి మైదానం నుంచి పంపించారు.
 
 తారల తళుక్కు...
 అభిమానులు తమపై పెట్టుకున్న భారీ అంచనాలను పలువురు స్టార్ ఆటగాళ్లు నిజం చేయగా... మరికొందరు నిరాశపరిచారు. లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), నెయ్‌మార్ (బ్రెజిల్), థామస్ ముల్లర్ (జర్మనీ) నాలుగేసి గోల్స్ సాధించి ‘గోల్డెన్ బూట్’ రేసులో ఉన్నారు. ఈ ముగ్గురితోపాటు రాబిన్ వాన్ పెర్సీ, అర్జెన్ రాబెన్ (నెదర్లాండ్స్), కరీమ్ బెంజెమా (ఫ్రాన్స్) అభిమానులను అలరించారు. ముఖ్యంగా స్పెయిన్‌పై పెర్సీ సాధించిన గోల్ ఈ వరల్డ్ కప్‌కే హైలైట్‌గా నిలుస్తుందనడంలో సందేహంలేదు. మరోవైపు రొనాల్డో (పోర్చుగల్), రూనీ (ఇంగ్లండ్), బలోటెలి, పిర్లో (ఇటలీ), ద్రోగ్బా (ఐవరీకోస్ట్) తమ జట్లను ఆదుకోలేకపోయారు.
 
 ఇక అగ్ని పరీక్ష
 ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో రసవత్తర అంకానికి రంగం సిద్ధమైంది. ఇకపై ఏ జట్టుకూ మరో అవకాశం ఉండదు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అదే ఆఖరి మ్యాచ్ అవుతుంది. నేటి నుంచి ప్రిక్వార్టర్ ఫైనల్స్ జరగనున్నాయి. తొలి రోజు జరిగే రెండు మ్యాచ్‌ల్లో ఆడే నాలుగు జట్లూ దక్షిణ అమెరికాకు చెందినవే కావడం విశేషం.
 
 బ్రెజిల్ ఁ చిలీ
 హా బ్రెజిల్ ఆశలన్నీ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్‌పైనే ఆధారపడి ఉన్నాయి. మెక్సికోపై నిరాశపరిచినా... మిగతా రెండు మ్యాచ్‌ల్లో నెయ్‌మార్ రెండేసి గోల్స్ చేశాడు. 1994 నుంచి ప్రతిసారీ బ్రెజిల్ ప్రిక్వార్టర్ ఫైనల్ దశను అధిగమించింది.
 
 హా 1962 ప్రపంచకప్‌లో మూడో స్థానం పొందిన తర్వాత చిలీ మరోసారి ఈ మెగా ఈవెంట్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేదు. లీగ్‌దశలో చిలీ 2-0తో డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ స్పెయిన్‌ను ఓడించింది. స్టార్ ఫార్వర్డ్స్ అలెక్స్ శాంచెజ్, వర్గాస్‌లపై ఆ జట్టు ఆశలు పెట్టుకుంది.
 
 హా ఇప్పటివరకు బ్రెజిల్, చిలీ ముఖాముఖిగా 68 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. బ్రెజిల్ 48 మ్యాచ్‌ల్లో... చిలీ 7 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 13 మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి. ప్రపంచకప్ చరిత్రలో చిలీతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ బ్రెజిల్ గెలిచింది.
 
 ఉరుగ్వే ఁ కొలంబియా
 హా గత ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో నిలిచిన ఉరుగ్వే ఈసారి అతికష్టంమీద ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంది. స్టార్ ప్లేయర్ లూయిస్ స్వారెజ్ గైర్హాజరీలో ఆ జట్టు ఆశలన్నీ 35 ఏళ్ల డీగో ఫొర్లాన్, 27 ఏళ్ల ఎడిన్సన్ కవానిలపై ఆధారపడి ఉన్నాయి. .
 హా కొలంబియా గతంలో ఎన్నడూ ప్రిక్వారర్స్ దశను అధిగమించలేదు. ఈసారి  ఫార్వర్డ్స్‌రోడ్రిగెజ్, వాలెన్సియా కీలకం.
 
 హా ఇప్పటివరకు ఉరుగ్వే, కొలంబియా 38 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఉరుగ్వే 18 మ్యాచ్‌ల్లో... కొలంబియా 11 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 9 మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement