హరికృష్ణ ఆశలు సజీవం
తిబిలిసి (జార్జియా): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్‌లో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన గేమ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రాణించాడు. యూరీ గొంజాలెజ్ విడాల్ (క్యూబా)తో ఆదివారం జరిగిన తొలి గేమ్‌లో ఓడిపోయిన హరికృష్ణ... సోమవారం జరిగిన రెండో గేమ్‌లో 41 ఎత్తుల్లో గెలిచాడు. దాంతో స్కోరు 1–1తో సమమైంది. వీరిద్దరి మధ్య విజేతను నిర్ణయించడానికి మంగళవారం టైబ్రేక్ గేమ్‌లను నిర్వహిస్తారు. మరోవైపు విశ్వనాథన్ ఆనంద్ 1.5–0.5తో లీ తియాన్ యో (మలేసియా)పై, సేతురామన్ 1.5–0.5తో పొనొమరియోవ్ (ఉక్రెయిన్)పై, విదిత్ 1.5–0.5తో డెల్గాడో (పరాగ్వే)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకోగా... దీప్ సేన్‌గుప్తా 0.5–1.5తో వాంగ్ హావో (చైనా) చేతిలో ఓడిపోయాడు.
వలెజో పోన్స్ (స్పెయిన్)తో కార్తికేయన్ మురళీ; త్రుయోంగ్ సన్ (వియత్నాం)తో ఆదిబన్ స్కోరు 1–1తో సమం కావడంతో మంగళవారం టైబ్రేక్ గేమ్‌ల ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. సోమవారం జరిగిన రెండో గేమ్‌ల్లో ఆనంద్ 71 ఎత్తుల్లో లీ తియాన్ యోతో... ఆదిబన్ 34 ఎత్తుల్లో త్రుయోంగ్ సన్‌తో ‘డ్రా’ చేసుకోగా... సేతురామన్ 58 ఎత్తుల్లో పొనొమరియోవ్‌పై, విదిత్ 44 ఎత్తుల్లో డెల్గాడోపై, కార్తికేయన్ మురళీ 45 ఎత్తుల్లో వలెజో పోన్స్‌పై గెలిచారు. దీప్ సేన్‌గుప్తా 48 ఎత్తుల్లో వాంగ్ హావో చేతిలో ఓటమి పాలయాయ్యాడు.