బిగ్బాష్లో హర్మన్ ప్రీత్ కౌర్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో జరిగే మహిళా బిగ్ బాష్ లీగ్లో భారత్కు చెందిన హర్మన్ ప్రీత్ కౌర్ పాల్గొనుంది. దీనిలో భాగంగా బిగ్ బాష్ ట్వంటీ 20 ఫ్రాంచైజీ సిడ్నీ థండర్ తో హర్మన్ ప్రీత్ ఒప్పందం చేసుకుంది. తద్వా బిగ్ బాష్ మహిళా లీగ్ లో పాల్గొనే తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు సాధించింది. బిగ్ బాష్ లీగ్ లో మూడు ఫ్రాంచైజీల నుంచి హర్మన్కు ఆఫర్లు వచ్చాయి. అందులో రెండో సీజన్లో రన్నరప్గా నిలిచిన సిడ్నీ సిక్సర్ కూడా ఉన్నా.. ప్రస్తుత చాంపియన్ సిడ్నీ థండర్ వైపే హర్మన్ మొగ్గు చూపింది.
ఈ మేరకు హర్మన్ ప్రీత్ కౌర్ సిడ్నీ థండర్ తో ఒప్పందం చేసుకున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. భారత మహిళా జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న హర్మన్ ప్రీత్.. వచ్చే బిగ్ బాష్ లీగ్లో భాగంగా సిడ్నీ థండర్ కు ఆడనున్నట్లు బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
ఇంగ్లండ్(మహిళల సూపర్ లీగ్), ఆస్ట్రేలియా(మహిళల బిగ్ బాష్ లీగ్)లలో నిర్వహించే లీగ్లో ఇక నుంచి భారత స్టార్ మహిళా క్రికెటర్లు ఆడేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఇటీవల అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల ఆరంభంలో భారత మహిళలు విదేశీ లీగ్ల్లో పాల్గొనడానికి బీసీసీఐ నుంచి క్లియరెన్స్ లభించింది. దీంతో పలువురు భారతీయ మహిళా క్రికెటర్లకు ఆర్థికంగా మరింత లాభం చేకూరనుంది.