
గత అనుభవంతో లాభం: ఇషాంత్
గతంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన అనుభవం తనకు బాగానే ఉపయోగపడుతుందని పేసర్ ఇషాంత్ అభిప్రాయపడ్డాడు.
గతంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన అనుభవం తనకు బాగానే ఉపయోగపడుతుందని పేసర్ ఇషాంత్ అభిప్రాయపడ్డాడు. అయితే ఉమేశ్, ఆరోన్, షమీలాంటి బౌలర్లు తనను ఆదర్శంగా తీసుకోవాలని భావించనన్నాడు. 19 ఏళ్ల వయస్సులో ఇషాంత్ 2007-08లో తొలిసారిగా ఆసీస్ పర్యటించినప్పుడు పాంటింగ్‌ను ముప్పుతిప్పలు పెట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే 2011-12 పర్యటనలో మాత్రం పెద్దగా రాణించలేదు. జట్టు కూడా 0-4తో దారుణంగా ఓడింది. ఓవరాల్‌గా ఇక్కడ అతను ఏడు టెస్టులు ఆడి 11 వికెట్లు తీశాడు. ‘జట్టు బౌలర్లందరం దాదాపు సమాన వయస్సులో ఉన్నాం. అందరిదీ సగటున 26 లేక 27 ఏళ్లు ఉంటాయి.
ఇది టీమిండియాకు లాభిస్తుంది. అంతేకాకుండా ఎవరికీ నేను రోల్ మోడల్‌గా ఉండాలనుకోవడం లేదు. నా దృష్టంతా బౌలింగ్ పైనే. అలాగే ఇక్కడ గతంలో పర్యటించిన అనుభవమే కాకుండా ఇతర విదేశీ పర్యటనల్లో నేను నేర్చుకున్న పాఠాలను మిగతా వారితో పంచుకుంటాను. ఎవరికైనా గత అనుభవాలు చాలా కీలకపాత్ర వహిస్తాయి. ఇక్కడ నా చివరి పర్యటనలో నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. మూలాలకు కట్టుబడి బౌలింగ్ చేయాలనుకుంటున్నాను’ అని ఇషాంత్ వివరించాడు. ఫాస్ట్ బౌలర్లకు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని చెప్పాడు.