'టమాటో చెట్టుకు ఉరి వేసుకోవాలనుకున్నా'
హరారే: చాలాసార్లు ఓటమి మనుషిని కుంగదీస్తుంది. కొన్నిసార్లైతే చనిపోవాలని కూడా అనిపిస్తుంది. ఒత్తిడితో కూడుకున్న క్రికెట్ లాంటి ఆటల్లోనైతే టెన్షన్ భరించడం చాలా కష్టం. భారీ ఆశలు పెట్టుకున్న తన జట్టు పేక మేడలా కూలిపోతుంటే, ప్రత్యర్థి చేతిలో చావుదెబ్బలు తింటోంటే.. ఏ శిక్షకుడికైనా రోషం పొడుచుకొస్తుంది. ఆ కోపం అదుపుతప్పినప్పుడు ఆత్మహత్యచేసు కోవాలని కూడా పిస్తుంది.. జింబాబ్వే కోచ్ ముకాయా ఎన్తిని లాగా.
భారత్ పై జింబాబ్వే వరుస ఓటములు జీర్ణించుకోలేకపోతున్నానన్న ఎన్తిని.. 'ఈ ఓటమి చూశాక నాకు బతకాలని లేదు. టమాటా చెట్టుకు ఉరి వేసుకుని చచ్చిపోదామనుకున్నా. స్టేడియం బయట టమాటో చెట్లు ఉండిఉంటే.. ఈ పాటికి మీరు ఎన్తిని మరణవార్తలు రాసేవారు' అంటూ ఒక్కతీరుగా ఆగ్రహావేశానికి లోనయ్యాడు. దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ గా ప్రపంచంలోని ఇతర బ్యాట్స్ మన్లను గడగడలాడించిన ఎన్తిని.. ఇంతలా కుంగిపోవడానికి బలమైన కారణంఉంది. (చదవండి: క్లీన్ స్వీప్ లాంఛనమ!)
జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత్ మూడు వన్ డేల సిరీస్ ను మరో మ్యాచ్ ఉందనగానే 2-0తో కైవసం చేసుకుంది. రెండో మ్యాచ్ లో జింబాబ్వే కనీస పోరాటం చేయకుండా చేతులెత్తేయడాన్ని ఆ దేశాభిమాను జీర్ణించుకోలేకపోయారు. 'ఈ ఘోరఅవమానాన్ని మేం చూడలేం' అంటూ స్టేడియంలోనే పెద్ద పెట్టున నినాదాలు చేసి, ఫ్లకార్డులు చూపారు. ఓట్ ఫీల్డ్ లో కూర్చుని మ్యాచ్ చూస్తోన్న ఎన్తినిని ఆ అభిమానుల చర్యలు బాధపెట్టాయట. అందుకే టొమాటో చెట్టుకు ఉరివేసుకుందామనుకున్నాడట! వాట్ మోర్ రాజీనామా తర్వాత ఎన్తిని జింబాబ్వే తాత్కాలిక కోచ్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.