ఇంగ్లండ్‌కు పాక్‌ పంచ్‌ | ICC Champions Trophy: Pakistan stun England to reach final | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌కు పాక్‌ పంచ్‌

Published Thu, Jun 15 2017 1:01 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

ఇంగ్లండ్‌కు పాక్‌ పంచ్‌

ఇంగ్లండ్‌కు పాక్‌ పంచ్‌

నిప్పులు చెరిగిన హసన్‌ అలీ
8 వికెట్లతో ఇంగ్లండ్‌ చిత్తు
రాణించిన అజహర్, ఫఖర్‌  


ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో ఫేవరెట్‌ ఇంగ్లండ్‌. దీనికి న్యాయం చేస్తూ లీగ్‌లో అన్ని మ్యాచ్‌లు గెలిచి అందరికంటే ముందే సెమీస్‌ చేరింది. కానీ! అసలు సమరంలో బ్యాట్లెత్తేసింది. సెమీఫైనల్లో అనూహ్యంగా పాకిస్తాన్‌ చేతిలో ఓడింది. ఈ టోర్నీ చరిత్రలో పాక్‌ తొలిసారి ఫైనల్‌కు చేరింది.

కార్డిఫ్‌: పాకిస్తాన్‌ మళ్లీ అనూహ్య ప్రదర్శన చేసింది. పేరున్న ఓపెనర్లు లేకున్నా... విశేష అనుభవజ్ఞులు లేకున్నా... సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడే బ్యాట్స్‌మెన్‌ లేకున్నా... పాకిస్తాన్‌ ఫైనల్‌ చేరింది. సంచలన బౌలింగ్‌తో పాటు యువ ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ అజహర్‌ అలీ రాణింపుతో సెమీస్‌లో పాక్‌ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను కంగుతినిపించింది. 2009 టి20 ప్రపంచకప్‌ తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్‌లో పాక్‌ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 49.5 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది.

బెయిర్‌స్టో (57 బంతుల్లో 43; 4 ఫోర్లు), జో రూట్‌ (56 బంతుల్లో 46; 2 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. పాక్‌ బౌలర్లలో హసన్‌ అలీ (3/35) ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. జునైద్‌ , రుమాన్‌ రయీస్‌ రెండేసి వికెట్లు తీశారు. తర్వాత 212 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్‌ 37.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అజహర్‌ అలీ (100 బంతుల్లో 76; 5 ఫోర్లు, 1 సిక్స్‌), ఫఖర్‌ జమాన్‌ (58 బంతుల్లో 57; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు సాధించారు.

ఆద్యంతం తడబాటే!
బహుశా మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌ ఇలా ఆడుతుందనుకోలేదెవరు... మరీ ఇంత ఈజీగా ఓడుతుందని ఊహించి ఉండరు. సత్తాతో పాటు సంచలనాన్ని నమ్ముకున్న పాకిస్తాన్‌ ఆద్యంతం పేస్‌తో ప్రత్యర్థిని వణికించేసింది. గాయపడిన ఆమిర్‌ స్థానంలో ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన రుమాన్‌ రయీస్‌ ఇంగ్లండ్‌ పతనానికి నాంది పలికాడు. అతని పదునుకు తొలుత హేల్స్‌ (13) నిష్క్రమించాడు. తర్వాత నిలదొక్కుకున్న మరో ఓపెనర్‌ బెయిర్‌ స్టోను హసన్‌ అలీ పెవిలియన్‌ చేర్చాడు. ఇలా 80 పరుగులకు ఓపెనర్లు ఔట్‌! అలా మొదలైన వికెట్ల పతనానికి అడ్డుకట్ట పడలేదు.

రాణించిన అజహర్, ఫఖర్‌
తమ పేసర్ల పుణ్యమాని తక్కువ లక్ష్యాన్నే ఛేదించేందుకు దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు పటిష్ట పునాది వేశారు. చేయాల్సిన లక్ష్యం చిన్నదే కావడంతో అజహర్‌ అలీ, ఫఖర్‌ జమాన్‌లు స్వేచ్ఛగా ఆడారు. తొలి వికెట్‌కు 118 పరుగులు జత చేశారు. వీరిద్దరూ అవుటయ్యాక... బాబర్‌ ఆజమ్‌ (38 నాటౌట్‌), హఫీజ్‌ (31 నాటౌట్‌)ల నిలకడతో మరో వికెట్‌ కోల్పోకుండా పాక్‌ మిగతా లాంఛనాన్ని పూర్తి చేసింది.

స్కోరు వివరాలు
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: బెయిర్‌స్టో (సి) హఫీజ్‌ (బి) హసన్‌ అలీ 43; హేల్స్‌ (సి) ఆజమ్‌ (బి) రయీస్‌ 13; రూట్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) షాదాబ్‌ ఖాన్‌ 46; మోర్గాన్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) హసన్‌ అలీ 33; స్టోక్స్‌ (సి) హఫీజ్‌ (బి) హసన్‌ అలీ 34; బట్లర్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) జునైద్‌ 4; మొయిన్‌ అలీ (సి) ఫఖర్‌ (బి) జునైద్‌ ఖాన్‌ 11; రషీద్‌ రనౌట్‌ 7; ప్లంకెట్‌ (సి) అజహర్‌ అలీ (బి) రయీస్‌ 9; మార్క్‌ వుడ్‌ రనౌట్‌ 3; జేక్‌ బాల్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్‌) 211.

వికెట్ల పతనం: 1–34, 2–80, 3–128, 4–141, 5–148, 6–162, 7–181, 8–201, 9–206, 10–211. బౌలింగ్‌: జునైద్‌ 8.5–0–42–2, రుమాన్‌  9–0–44–2, ఇమద్‌ 5–0–16–0, షాదాబ్‌ 9–0–40–1, హసన్‌ అలీ 10–0–35–3, హఫీజ్‌ 8–0–33–0.

పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: అజహర్‌ అలీ (బి) బాల్‌ 76; ఫఖర్‌ జమాన్‌ (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 57; ఆజమ్‌ నాటౌట్‌ 38; హఫీజ్‌ నాటౌట్‌ 31; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం (37.1 ఓవర్లలో 2 వికెట్లకు) 215.

వికెట్ల పతనం: 1–118, 2–173.
బౌలింగ్‌: వుడ్‌ 8–1–37–0; బాల్‌ 8–0–37–1; స్టోక్స్‌ 3.1–0–38–0; ప్లంకెట్‌ 6–0–33–0; రషీద్‌ 10–0–54–1; మొయిన్‌ అలీ 2–0–15–0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement