చాహల్ స్పిన్ మాయాజాలం.. భారత్ ఘనవిజయం
బెంగళూరు: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో ట్వంటీ-20 మ్యాచ్‌లో విరాట్ సేన 75 పరుగులతో ఘన విజయం సాధించింది. 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 16.3 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. దీంతో టీ20 సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. మొదట బ్యాట్స్‌మన్ల వీర విహారం, ఆపై బౌలర్లు రాణించడంతో భారత్ విజయం నల్లేరుపై నడకైంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హీరో, యువ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ (6/25) స్పిన్ మాయాజాలానికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ దాసోహం అయ్యారు. తద్వారా టీ20లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి బౌలర్‌గానూ చాహల్ రికార్డు సృష్టించాడు. జాసన్ రాయ్(32), రూట్(42), మోర్గాన్(40) రాణించడంతో ఓ దశలో 13 ఓవర్లలో 119/2తో పటిష్ట స్థితిలో ఉన్న ఇంగ్లండ్ చాహల్ దెబ్బకు విలవిల్లాడింది. ఇంగ్లండ్ చివరి 8 వికెట్లను 8 పరుగుల తేడాలో కోల్పోయింది.
ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన చాహల్.. ఆ ఓవర్లో వరుస బంతుల్లో అద్భుత ఫామ్‌లో ఉన్న మోర్గాన్(21 బంతుల్లో 40: 2 ఫోర్లు, 3 సిక్సర్లు)ను, జో రూట్ (37 బంతుల్లో 42: 4 ఫోర్లు, 2 సిక్సర్లు)ను వెనక్కిపంపాడు. అక్కడితో ఇంగ్లండ్ పతనం మొదలైంది. తన తర్వాతి ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు తీశాడు చాహల్. మోయిన్ అలీ(2)ను, నాలుగో బంతికి స్టోక్స్ ను, చివరి బంతికి జోర్డాన్‌ను ఔట్ చేశాడు.
టీమిండియా ఇన్నింగ్స్: అంతకు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నాలుగు పరుగల వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ(2) అనవసర పరుగులు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. రాహుల్(18 బంతుల్లో 22: 2 ఫోర్లు, 1 సిక్సర్)తో జతకలిసిన రైనా సిక్సర్లతో ఇంగ్లండ్ బౌలర్లపై పైచేయి సాధించాడు. స్టోక్స్ బౌలింగ్‌లో రాహుల్ ఔటయ్యాక ధోనీ, రైనాలు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వెటరన్ ప్లేయర్స్ సురేష్ రైనా (45 బంతుల్లో 63: 2 ఫోర్లు, 5 సిక్సర్లు), మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(36 బంతుల్లో 56: 5పోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. మ్యాచ్ 18వ ఓవర్లో యువరాజ్ ఆడిన షాట్లు అమోఘం. జోర్డాన్ వేసిన ఆ ఓవర్లో మూడు సిక్సర్లు, ఫోర్ తో యువరాజ్(10 బంతుల్లో 27: 3 సిక్సర్లు, 1 ఫోర్) ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. స్కోరు బోర్డును మరింత పెంచే క్రమంలో మిల్స్ బౌలింగ్‌లో కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మిల్స్, జోర్డాన్, ప్లంకెట్, స్టోక్స్ తలో వికెట్ తీశారు.