ఇంగ్లండ్‌కు భారీ లక్ష్యం
బెంగళూరు: ఇంగ్లండ్తో చివరిదైన మూడో ట్వంటీ-20 మ్యాచ్ లో టీమిండియా వెటరన్ బ్యాట్స్మన్లు చెలరేగారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసి ఇంగ్లండ్ ముందు భారీ విజయలక్ష్యాన్ని నిలిపింది. వెటరన్ ప్లేయర్స్ సురేష్ రైనా (45 బంతుల్లో 63: 2 ఫోర్లు, 5 సిక్సర్లు), మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(36 బంతుల్లో 56: 5పోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది.
అంతకు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు పరుగల వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ(2) అనవసర పరుగులు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. రాహుల్(18 బంతుల్లో 22: 2 ఫోర్లు, 1 సిక్సర్)తో జతకలిసిన రైనా సిక్సర్లతో ఇంగ్లండ్ బౌలర్లపై పైచేయి సాధించాడు. స్టోక్స్ బౌలింగ్‌లో రాహుల్ ఔటయ్యాక ధోనీ, రైనాలు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మ్యాచ్ 18వ ఓవర్లో యువరాజ్ ఆడిన షాట్లు అమోఘం.
జోర్డాన్ వేసిన ఆ ఓవర్లో మూడు సిక్సర్లు, ఫోర్ తో యువరాజ్ ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. స్కోరు బోర్డును మరింత పెంచే క్రమంలో మిల్స్ బౌలింగ్‌లో కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి యువరాజ్(10 బంతుల్లో 27: 3 సిక్సర్లు, 1 ఫోర్) ఔటయ్యాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో జోర్డాన్ బౌలింగ్‌లో ధోనీ ఔటవ్వాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి పాండ్యా(11) రనౌటయ్యాడు. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 202 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో మిల్స్, జోర్డాన్, ప్లంకెట్, స్టోక్స్ తలో వికెట్ తీశారు.