జకర్తా: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. స్టార్ షట్లర్ పీవీ సింధు గురువారం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఐదో సీడ్ సింధు 21–16, 16–21, 19–21తో సయాక తకహషి (జపాన్) చేతిలో భంగపడింది. తొలి గేమ్‌ను గెలుచుకున్న సింధు... అనంతరం మిగిలిన రెండు గేముల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకు ముందే బుధవారం మిగిలిన భారత షట్లర్లు టోర్నీనుంచి నిష్క్రమించారు. తొలి రౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ 21–19, 13–21, 5–21తో సయాక తకహషి చేతిలో ఓడింది.
కిడాంబి శ్రీకాంత్ 21–18, 12–21, 14–21తో హిరెన్ రుస్తావిటో (ఇండోనేసియా) చేతిలో, సాయి ప్రణీత్ 21–16, 18–21, 10–21తో షి యు కీ (చైనా) చేతిలో, సౌరభ్ వర్మ 21–17, 15–21, 10–21తో లు జుయాంగ్ జు (చైనా) చేతిలో, సమీర్ వర్మ 17–21, 21–19, 10–21తో టామీ సుగియార్తో (ఇండోనేసియా) చేతిలో, పారుపల్లి కశ్యప్ 14–21, 12–21తో ఆంథోని సినిసుక జింటింగ్ (ఇండోనేసియా) చేతిలో, హెచ్‌ఎస్ ప్రణయ్ 17–21, 14–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి 20–22, 15–21 స్కోరుతో మొహమ్మద్ – హెండ్రా సెటియావన్ జోడీ (ఇండోనేసియా) చేతిలో ఓడగా... మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా– సిక్కి రెడ్డి జంట 8–21, 14–21తో కో సుంగ్ హ్యూన్– యోమ్ హే వోన్ ద్వయం (దక్షిణ కొరియా) చేతిలో పరాజయాన్ని చవిచూసింది.
Comments
Please login to add a commentAdd a comment