అక్షరాలా అదే జోరు
- ప్లేఆఫ్‌కు పంజాబ్ కింగ్ ఎలెవన్
- ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై విజయం
ఇన్నాళ్లూ పంజాబ్ అంటే మ్యాక్స్‌వెల్, మిల్లర్, సెహ్వాగ్, బెయిలీ... కానీ వీళ్లంతా పెవిలియన్‌కు చేరినా కూడా భారీ లక్ష్యాన్ని ఛేదించగల దమ్ము లోయర్ మిడిలార్డర్‌కు ఉందని నిరూపించారు కింగ్స్ ఎలెవన్ క్రికెటర్లు. కొత్త స్టార్ మనన్ వోహ్రా మెరుపు ఆరంభానికి... అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ షో తోడవడంతో... పంజాబ్ ఖాతాలో మరో విజయం చేరింది. ఢిల్లీపై విజయం ద్వారా అధికారికంగా ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఐపీఎల్-7లో ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టు పంజాబ్.
న్యూఢిల్లీ: ఓపెనర్లు, మిడిల్ ఆర్డరే కాదు చివరి వరుస బ్యాట్స్‌మెన్ కూడా అవసరమైతే జట్టుకు ఉపయోగపడతారని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆటగాళ్లు నిరూపించుకున్నారు. వరుసగా నాలుగు ఓవర్లలో నాలుగు కీలక వికెట్లు నేలకూలినా బెదరకుండా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. యువ ఓపెనర్ మనన్ వోహ్రా (19 బంతుల్లో 42; 4 ఫోర్లు; 3 సిక్స్‌లు) తుఫాన్ ఆటతీరుతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఫిరోజ్ షా కోట్ల మైదానంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు ఓడింది.
తొలి సీజన్ 2008 తర్వాత పంజాబ్ జట్టు నాకౌట్ సమరానికి అర్హత సాధించడం ఇప్పుడే.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 164 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (44 బంతుల్లో 69; 7 ఫోర్లు; 3 సిక్స్), కెవిన్ పీటర్సన్ (32 బంతుల్లో 49; 6 ఫోర్లు; 1 సిక్స్) మెరుపులు మెరిపించారు. అయితే ఢిల్లీ చివర్లో అనవసరంగా ఒత్తిడికి గురై స్వల్ప విరామాల్లోనే వికెట్లను కోల్పోయింది.
సందీప్ శర్మ, హెన్‌డ్రిక్స్‌లకు చెరి మూడు వికెట్లు పడ్డాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లకు 165 పరుగులు చేసింది. సెహ్వాగ్ (22 బంతుల్లో 23; 2 ఫోర్లు; 1 సిక్స్) రాణించగా చివర్లో అక్షర్ పటేల్ (35 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడాడు. తాహిర్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆల్‌రౌండ్ షో చూపించిన అక్షర్ పటేల్‌కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
కేపీ, కార్తీక్ దూకుడు
ఢిల్లీ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఓపెనర్ విజయ్ (5) ఇచ్చిన క్యాచ్‌ను డీప్ మిడ్ స్క్వేర్ లెగ్‌లో వెనక్కి పరిగెడుతూ హెన్‌డ్రిక్స్ అద్భుత క్యాచ్ ను అందుకున్నాడు. అయితే దినేశ్ కార్తీక్ అండతో కెప్టెన్ పీటర్సన్ జోరును ప్రదర్శించాడు. దీంతో పవర్ ప్లేలో 55 పరుగులు వచ్చాయి. అడపాదడపా ఫోర్లు బాదుతూ నిలకడగా సాగుతున్న ఈ జోడికి 11వ ఓవర్‌లో బ్రేక్ పడింది. పటేల్ బౌలింగ్‌లో కేపీ బౌల్డ్ కావడంతో రెండో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే కార్తీక్ మాత్రం తన జోరును కొనసాగించి 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
చివర్లో వేగంగా ఆడే క్రమంలో ఢిల్లీ వరుసగా వికెట్లు పోగొట్టుకుంది. 140 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో ఉన్న జట్టు 12 బంతుల వ్యవధిలోనే దినేశ్ కార్తీక్ సహా ఐదు వికెట్లు కోల్పోయింది. ఇందులో పార్నెల్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ దగ్గర మ్యాక్స్‌వెల్ గాల్లోకి ఎగిరి కళ్లు చెదిరే క్యాచ్ తీసుకున్నాడు. దీంతో భారీ స్కోరు దిశగా వెళుతున్న ఢిల్లీ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.
ముందుగా వోహ్రా.. చివర్లో పటేల్
పంజాబ్ తమ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. మూడో ఓవర్ నుంచి మనన్ వోహ్రా తన బ్యాట్‌ను ఝుళిపించాడు. బౌలర్ ఎవరైనా బాదుడు మాత్రం ఆపకపోవడంతో పవర్‌ప్లేలోనే పంజాబ్ 66 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాతి ఓవర్ రెండో బంతికే తాహిర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి వోహ్రా క్యాచ్ అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత వరుస ఓవర్లలో సెహ్వాగ్ (22 బంతుల్లో 23; 2 ఫోర్లు; 1 సిక్స్), మ్యాక్స్‌వెల్ (11 బంతుల్లో 14; 1 సిక్స్), మిల్లర్ (2) అవుట్ కావడంతో ఢిల్లీకి పట్టు దొరికింది.
ఈ దశలో పంజాబ్ ఓపికను ప్రదర్శించింది. లోయరార్డర్ బ్యాట్స్‌మెన్ సాహా (13 బంతుల్లో 13; 1 ఫోర్), అక్షర్ పటేల్ ఆచితూచి పరుగులు సాధించారు. ఐదో వికెట్‌కు 33 పరుగులు జోడించిన అనంతరం సాహా అవుటయ్యాడు. 30 బంతుల్లో 38 పరుగులు చేయాల్సిన దశలో క్రీజులో అడుగుపెట్టిన బెయిలీ విఫలమైనా... అక్షర్, రిషి ధావన్ కలిసి విజయాన్ని పూర్తి చేశారు.
స్కోరు వివరాలు
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: విజయ్ (సి) హెండ్రిక్స్ (బి) సందీప్ 5; పీటర్సన్ (బి) పటేల్ 49; దినేశ్ కార్తీక్ (సి) రిషి ధావన్ (బి) హెన్‌డ్రిక్స్ 69; డుమిని (సి) మ్యాక్స్‌వెల్ (బి) హెన్‌డ్రిక్స్ 17; జాదవ్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) సందీప్ శర్మ 0; అగర్వాల్ (బి) సందీప్ శర్మ 6; తివారి నాటౌట్ 10; పార్నెల్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) హెన్‌డ్రిక్స్ 2; షమీ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు (లెగ్ బైస్ 1, వైడ్లు 4) 5; మొత్తం (20 ఓవర్లలో ఏడు వికెట్లకు) 164.
వికెట్ల పతనం: 1-13; 2-84; 3-140; 4-144; 5-151; 6-155; 7-158.
బౌలింగ్: సందీప్ 4-0-35-3; హెన్‌డ్రిక్స్ 4-0-36-3; పటేల్ 4-1-18-1; రిషి ధావన్ 4-0-42-0; శివమ్ శర్మ 4-0-32-0.
పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) తివారి (బి) డుమిని 23; వోహ్రా (సి) విజయ్ (బి) తాహిర్ 42; మ్యాక్స్‌వెల్ (బి) తాహిర్ 14; మిల్లర్ (బి) డుమిని 2; సాహా (సి) పార్నెల్ (బి) షమీ 13; పటేల్ నాటౌట్ 42; బెయిలీ (సి) జాదవ్ (బి) తాహిర్ 6; రిషి ధావన్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు (లెగ్ బైస్ 4, వైడ్లు 11) 15; మొత్తం (19.4 ఓవర్లలో ఆరు వికెట్లకు) 165.
వికెట్ల పతనం: 1-67; 2-84; 3-92; 4-94; 5-127; 6-155.
బౌలింగ్: పార్నెల్ 3.4-0-42-0; షమీ 4-0-39-1; ఉనాద్కట్ 4-0-31-0; తాహిర్ 4-0-22-3; డుమిని 4-0-27-2.